అంతుపట్టని ప్రదీప్‌ వ్యవహారం | anchor pradeep did not attend police counselling | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 4 2018 11:46 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

anchor pradeep did not attend police counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారం అంతుచిక్కడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిందేనని పోలీసులు పట్టుబడుతున్నా.. ప్రదీప్‌ మాత్రం రావడం లేదు. దీంతో అతను పరారీలో ఉన్నట్టు భావించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు కనిపిస్తోంది.

గత నెల 31వ తేదీ అర్ధరాత్రి యాంకర్‌ ప్రదీప్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ.. ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోయాడు. మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉండగా అతను రాలేదు. దీంతో బుధవారం ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరుకావాల్సిందేనని, ఒకవేళ హాజరుకాకపోతే.. చార్జ్‌షీట్‌ దాఖలుచేసి.. వారెంట్‌ జారీచేస్తామని, ప్రదీప్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా ప్రదీప్‌ దిగిరాలేదు. పోలీసుల ముందు హాజరుకాలేదు. కౌన్సెలింగ్‌కు డుమ్మా కొట్టారు. ఇప్పటికే 31వ తేదీ అర్ధరాత్రి దొరికిపోయిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

ఈ క్రమంలో బుధవారం కూడా ప్రదీప్‌ రాకపోవడం.. గురువారమైనా అతను వస్తాడా? రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రదీప్‌ సెలబ్రిటీ యాంకర్‌ కావడంతో ఈ కేసుపై మీడియా దృష్టి ప్రధానంగా ఉంది. అయినప్పటికీ ప్రదీప్‌ వరుసగా డుమ్మా కొడుతుండటం పోలీసులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అతని కోసం ఇంట్లో, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా.. అందుబాటులో లేడని తెలుస్తోంది. మణికొండలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ప్రదీప్‌ ఉంటున్నాడని అంటున్నారు.

వాహనం నడుపుతున్న సమయంలో ప్రదీప్‌ బాగా మద్యం సేవించి ఉన్నాడని, బ్రీత్‌ అనలైజర్‌లో 150 పాయింట్లు దాటితే.. జైలుశిక్షపడే అవకాశముంటుందని, ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు వచ్చిందని, కాబట్టి అతనికి జైలుశిక్ష పడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ పోలీసులను తప్పించుకొని తిరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అతను కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే.. చార్జ్‌షీట్‌ దాఖలుచేసి.. వారెంట్‌ జారీచేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రదీప్‌ నడిపించిన వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్‌ ఉండటంతో ఆర్టీఐ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనేఅవకాశముందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement