యాంకర్‌ ప్రదీప్‌ ఎక్కడ.. ఈ రోజు హాజరవుతాడా? లేదా? | anchor pradeep not attend police counselling | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 3 2018 11:06 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

anchor pradeep not attend police counselling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యూఇయర్‌ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మూడురోజులైనా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. ప్రదీప్‌ మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. దీంతో బుధవారం ఆయన ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు హాజరై తీరాల్సిందేనని పోలీసులు అంటున్నారు. మరోవైపు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నేపథ్యంలో ప్రదీప్‌ అజ్ఞాతంలో ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. గత నెల 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయితే, మీడియా దృష్టి ప్రధానంగా ఈ కేసుపై ఉండటంతో ప్రదీప్‌ భయపడి నిన్న కౌన్సెలింగ్‌కు గైర్హాజరై ఉండొచ్చునని, ఈ రోజు ఆయన వస్తాడని తాము భావిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

కౌన్సెలింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో హాజరుకావాల్సిందే!
మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు హితవు పలికిన ప్రదీపే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటం కలకలం రేపుతోంది. 31వ తేదీ పట్టుబడిన ప్రదీప్‌ రెండురోజులైనా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు బుధవారం వరకు గడువు ఉంది. ఒకవేళ బుధవారం రాకపోతే.. ప్రదీప్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు చేసి.. వారెంట్‌ జారీచేసి.. కోర్టులో ప్రవేశపెడతామని అడిషనల్‌ డీసీపీ అమర్‌కాంత్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రదీప్‌ చర్యను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరైతే.. తాగి నడపడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి అతనికి వివరించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని, మద్యం సేవించిన స్థాయిని బట్టి జరిమానా లేదా ఒకటి రెండు రోజులు జైలుశిక్ష పడే అవకాశముందని వివరించారు. మీడియా అటెన్షన్‌కు భయపడి నిన్న కౌన్సెలింగ్‌ ప్రదీప్‌ రాకపోయి ఉండొచ్చునని, ఈ రోజు వస్తాడని ఆశిస్తున్నామని చెప్పారు. కౌన్సెలింగ్‌ ఎగ్గొట్టే అవకాశమే లేదని, కౌన్సెలింగ్‌ రాకపోయినా.. వారెంట్‌ జారీచేసి.. మొదట కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాతే కోర్టులో హాజరుపరుస్తామని అడిషనల్‌ డీసీపీ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement