పశ్చిమగోదావరి జిల్లా: దళితులను తీవ్రంగా అవమానించిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీడియో షేర్ చేసినందుకు గానూ మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కామిరెడ్డి నానిని పశ్చిమ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త నానిని బలవంతంగా అరెస్ట్ చేసి ఏలూరు త్రీటౌన్‌కి పోలీసులు తరలించారు. నిన్న రాత్రే కామిరెడ్డి నానికి వివాహం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నాం దెందులూరు మండలం శ్రీరామవరంలోని సొంత ఇంటిలో రిసెప్షన్ జరిగింది.
వివాహ రిసెప్షన్ ముగిసిన తర్వాత పోలీసులు నానిని అరెస్ట్ చేశారు. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే నానిని అరెస్ట్ చేయడంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై మాత్రం ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దళితులపై దూషణ పర్వానికి దిగిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గత నాలుగు రోజులుగా దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలి వీడియో షేర్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతమనేని కేసును తప్పు దోవ పట్టించేలా పశ్చిమ పోలీసుల చర్యలు ఉన్నాయని, కామిరెడ్డి నాని అక్రమ అరెస్ట్‌ను దెందులూరు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ తీవ్రంగా ఖండించారు.
అన్యాయంగా అరెస్ట్ చేశారు: నాని తండ్రి
తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చింతమనేని వీడియో షేరింగ్ కేసులో అరెస్టయిన కామిరెడ్డి నాని తండ్రి వాపోయారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చాలా సేపటి నుంచి ఉన్నా.. మమ్మల్ని పోలీస్‌స్టేషన్ లోపలికి రానివ్వడం లేదన్నారు. దళితులను తిట్టిన చింతమనేనిని వదిలేసి నా కుమారుడిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వీడియోని నా కుమారుడు అసలు షేర్ చేయలేదని, కేవలం వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతోనే అరెస్ట్ చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment