
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ నెల 3వ తేదీన జరిగిన మూక హత్య కేసుకు సంబంధించి ఓ ఆర్మీ జవాన్‌ను కోర్టు 14 రోజులపాటు జైలుకు పంపింది. జవాన్ జితేంద్ర మాలిక్‌ను ఆర్మీ శనివారం రాత్రే ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పజెప్పింది. ఆదివారం మాలిక్‌ను పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన అనంతరం అతణ్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం మాలిక్‌ను 14 రోజలపాటు జైలుకు పంపుతున్నట్లు మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు.
మరోవైపు ఇదే కేసుకు సంబంధించి బులంద్‌షహర్ అదనపు ఎస్పీ రాయిస్ అక్తర్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బులంద్‌షహర్ జిల్లాలోని ఓ గ్రామంలో గో వధ జరిగిందన్న అనుమానంతో ఈ నెల 3న బజరంగ్ దళ్ తదితర సంస్థల సభ్యలు 400 మంది ఆ గ్రామంపై మూకదాడికి పాల్పడ్డారు. ఈ గొడవల్లో జరిపిన కాల్పుల్లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌తోపాటు 20 ఏళ్ల యువకుడు మరణించాడు. ఇన్‌స్పెక్టర్‌ను తుపాకీతో కాల్చింది జవాన్ జితేంద్ర మాలికేనని ఆరోపణ. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు.
అయితే ప్రధాన నిందితుడు, బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ యోగేశ్ రాజ్ మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరులో లోపాలు ఉన్నందునే పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అక్తర్‌ను లక్నోలోని పీఏసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఘజియాబాద్‌లో ఏఎస్పీగా ఉన్న మనీశ్ మిశ్రాను అక్తర్ స్థానంలో నియమించింది. శనివారమే బులంద్‌షహర్ ఎస్‌ఎస్పీ కృష్ణ బహదూర్ సింగ్‌ను కూడా బదిలీపై లక్నోకు పంపింది. బులంద్‌షహర్‌లో ప్రస్తుతం పరిస్థితి అంతా ప్రశాంతంగా, సవ్యంగానే ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. తమ రాష్ట్రంలో మూకహత్యలు జరగడం లేదనీ, ఈ ఘటన ఓ చిన్న యాక్సిడెంట్ లాంటిదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారమే చెప్పడం, ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించడం తెలిసిందే.