ప్రతీకాత్మక చిత్రం
జహీరాబాద్: జహీరాబాద్‌లో మహిళపై లైంగిక దాడి జరిపిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు కారులో పరారయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న మరో నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలను బుధవారం రాత్రి డీఎస్పీ గణపత్‌జాదవ్ వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం జహీరాబాద్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పవన్‌కుమార్ న్యాల్‌కల్ మండలం మెటల్‌కుంట ప్రాంతంలో ఉన్నాడని సమాచారం అందడంతో ఎస్‌ఐ వెంకటేష్ అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు.
మిగతా ఇద్దరు నిందితులు కారులో వెళుతున్నట్లు పవన్‌కుమార్ చెప్పడంతో వారిని పట్టుకునేందుకు ఎస్‌ఐ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు రాయికోడ్ మండలం మహబత్‌పూర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సోమాచారి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని తమ్ముడు బ్రహ్మచారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో బ్రహ్మచారిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ గణపత్ జాదవ్ పేర్కొన్నారు. మృతుడు సోమాచారి హైదరాబాద్‌లోని ఉప్పల్ వద్ద టీ స్టాల్‌ను నడుపుతున్నాడు. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన గిద్దలూరు ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్ సోమాచారి టీ స్టాల్‌లో పని చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment