భారత పౌరసత్వ సవరణ బిల్లు 2016 ను వ్యతిరేకిస్తూ అస్సాంలో నిరసనలు (ఫైల్ ఫోటో)
గువాహటి(అస్సాం): రాష్ట్రంలో గల ఏకైక బీజేపీ ముస్లిం ఎమ్మెల్యేకు శనివారం బెదిరింపు లేఖ వచ్చింది. ‘15 రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చెయ్, లేదంటే చంపేస్తా’ అని ఎమ్మెల్యే అమీనుల్ హఖీ లస్కర్‌కి ఆగంతకుడు లేఖ రాశాడు. ఉదాసీనంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దనీ, సూచనగా లేఖతో రెండు బుల్లెట్లను కూడా పంపాడు. ఎరుపు రంగు సిరాతో రాసిన ఈ లెటర్ మే 22న బెంగాల్‌లోని కరీంగంజ్ నుంచి పోస్టు కాగా జూన్ 9 న సదరు ఎమ్మెల్యేకు చేరింది.
వివరాలు.. పొరుగు దేశాల నుంచి భారత్‌లోకి చొరబడి ఆశ్రయం పొందే మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం యోచించింది. ఆ దిశగా 2016లో భారత పౌరసత్వ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, దీని వల్ల పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని హిందువులు అస్సాంలోకి పెద్ద ఎత్తున చొరబడే ప్రమాదం ఉందనీ ఇక్కడి హిందువులు ఆందోళన చెందుతున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం బీజేపీ సభ్యుడివి కావడం వల్లే.. ఒక ముస్లిం అయివుండీ హిందూ నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నావనీ లెటర్‌లో ఆగంతకుడు ఎమ్మెల్యేపై మండిపడ్డాడు. ముస్లిం వ్యతిరేకిగా ఉండిపోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించాడు. బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే, సిలిచార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టల్ వివరాల ఆధారంగా త్వరలోనే ఆగంతకున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment