విశాఖపట్నం : 2011లోఇంటర్మీడియేట్ విద్యార్థిని రాపేటి అశ్విని మృదుల(16)ను దుండగులు కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విశాఖ నగరంలో ఎంతో సంచలనం సృష్టించింది. పట్టపగలే ఓ విద్యార్థిని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం నగరవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అశ్వినిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకుని, కోర్టులో హాజరు పరిచారు. అయితే ఇన్నేళ్ల పాటుసాగిన ఈ కేసు చిట్టచివరికి డబ్బు వైపే మొగ్గు చూపి, న్యాయాన్ని నిజంగానే అంధకారంలో ముంచేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
తమ కూతుర్ని చంపిన వారికి కఠినంగా శిక్ష వేసి, ఆమె ఆత్మకు శాంతి కలగజేస్తారని భావించిన అశ్విని తల్లిదండ్రులకు నేడు తీవ్ర పరాభావం ఎదురైంది. దాదాపు ఏడేళ్ల పాటు విచారణ సాగిన ఈ కేసుపై నేడు బాధితురాలికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. అశ్వినిని చంపిన నలుగురు నిందితులను నిర్దేషులుగా ప్రకటిస్తూ.. జడ్జి తీర్పు వెలురించారు. నలుగురు నిందితులకు అనుకూలంగా తీర్పు చెప్పిన అనంతరం, కేసును మూసివేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. కేసు మూసివేస్తున్నట్టు జడ్జి తీర్పు వెలువరించగానే, నిందితులు మరింత రెచ్చిపోయారు. కూతురు హత్య కేసులో కొన్నేళ్లుగా పోరాడుతున్న అశ్విని తల్లిపై నిందితులు దాడికి పాల్పడ్డారు.
అశ్విని తల్లి కూడా న్యాయవాదే. ఈ నేపథ్యంలో ఆమెను మరింత కుంగుబాటుకు గురి చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రామ్ మూర్తి నాయుడు, జడ్జి శేషు బాబు నిందితులతో జత కట్టి, వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలా డబ్బుతో న్యాయాన్ని కొనేశారని అశ్విని తల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశ్వినిని నిందితులే హత్య చేశారు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిందితుల వేలిముద్రలు అశ్వినిని హత్య చేసిన వారి వేలిముద్రలతో సరిపోవడమే కాకుండా.. ఆమె చెవి పోగులు, చెయిన్ నిందితుల దగ్గర లభించాయి. అయినప్పటికీ వీరు అమాయకులని, వారికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని కేసును జడ్జి మూసివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నేడు నగరంలో గాంధీ విగ్రహం నుంచి కమిషనర్ ఆఫీసు వరకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శిస్తున్నారు. నాలుగు గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతోంది. జస్టిస్‌ఫర్‌అశ్వినిమృదుల అనే హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అశ్విని చనిపోయినప్పటి నుంచి ఈ కేసుపై తీవ్రంగా పోరాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ నిందితులకు అనుకూలంగా తీర్పురావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని పలువురు అంటున్నారు. కాగ, విశాఖలోని దొండపర్తి జంక్షన్‌లోని మెట్రో రెసిడెన్సీలోని ఈ హత్య జరిగింది. అశ్విని మృదులను మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తుండగా.. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. హత్య జరిగిన రోజు తల్లి హైదరాబాద్‌లో ఉన్నారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న తమ్ముడు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగింది. మృదుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్నేహితులు, సన్నిహితులు సామాజిక మాధ్యమాల్లో నినదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment