బనశంకరి: ఒక వివాహిత యువతి ప్రియుడితో కలిసి వెళ్తుండగా దుండగులు దాడి చేసి ప్రియుడి చేతిని నరికివేశారు. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన 25 ఏళ్ల యువతికి అదే జిల్లాకు చెందిన యువకుడితో ఒకనెల క్రితం పెళ్లయింది. ఈమెకు తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా మిడిగేశి రవీశ్ (32)తో అప్పటికే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. రవీశ్ బెంగళూరులో ఓ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఆనేకల్‌లోని యారండహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. యువతి కుటుంబ సభ్యులు మరో యువకుడితో ఇష్టంలేని వివాహం చేయడంతో వారం క్రితం ఇంటినుంచి పారిపోయి రవీశ్ వద్దకు చేరుకుంది.
ఏం జరిగిందంటే..
మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రవీశ్, ఆమె కలిసి బన్నేరుఘట్టలో ఉన్న చంపకధామ దేవాలయం వెనుకనున్న ఆంజనేయస్వామి గుడికి బయలుదేరారు. బన్నేరుఘట్ట అటవీప్రదేశంలో ఏకాంతంగా ఉండగా, అక్కడికి వచ్చిన కొందరు దుండగులు మారణాయుధాలతో యువకుడిపై దాడి చేశారు. కుడిచేతి మణికట్టు వరకు నరికివేసి చేతిని తమ వెంట తీసుకెళ్లారు. ఆమె గాయపడిన ప్రియుడిని స్థానికుల సహాయంతో బన్నేరుఘట్ట ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యంకోసం ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment