కత్తి కట్టి దాడి  | Attack on YS Jagan was planed 9 months ago | Sakshi
Sakshi News home page

కత్తి కట్టి దాడి 

Published Fri, Oct 26 2018 4:41 AM | Last Updated on Fri, Oct 26 2018 4:41 AM

Attack on YS Jagan was planed 9 months ago - Sakshi

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనిపెల్ల శ్రీనివాసరావు వెనుక ఉండి ఆడిస్తున్నదెవరు? దాడికి చాలా నెలల క్రితమే వ్యూహం రచించారా? పథకం ప్రకారమే ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో నిందితుడు పనికి చేరాడా? జగన్‌తో అతడు ఉన్నట్లుగా చూపించే ఫ్లెక్సీలను ఆగమేఘాలపై సృష్టించిందెవరు? పందెంకోళ్లకు కత్తులు కట్టడంలో నేర్పరులైన నిందితుడు శ్రీనివాసరావు కుటుంబానికి టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం ఏమిటి? గురువారం మధ్యాహ్నం జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడి స్వగ్రామంలో టీడీపీ నేతలు వాలిపోవటమే వారి మధ్య సన్నిహిత సంబంధాలను రుజువు చేస్తోంది.   

టీడీపీ సానుభూతి పరుడే: నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ అభిమాని అంటూ ఎల్లో మీడియా, పచ్చనేతలు ఓ పథకం ప్రకారం సాగిస్తున్న ప్రచారంతో స్థానికులు విస్తుపోతున్నారు. ఓ వ్యక్తి ఫొటోను జగన్‌ చిత్రంతో జోడించి ఫ్లెక్సీ రూపొందించి కట్టుకథలు అల్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ అభిమాని కాబట్టే  ఇల్లు వేగంగా మంజూరు అయిందని అంటున్నారు. అతడు ఏ పార్టీ సానుభూతిపరుడో ఇదే తెలియజేస్తోందని పేర్కొంటున్నారు. పైగా ఇల్లు మంజూరయ్యాక రూ.8 లక్షలు ఖర్చు చేసి ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేశాడంటే అదంతా ఎవరు సాయం చేసి ఉంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారంటే అతడి వెనుక ‘పచ్చ’నేతల మద్దతు ఏ మేరకు ఉందో ఇట్టే తెలిసిపోతోందని చెబుతున్నారు. 

ఠాణేలంకలో పచ్చ నేతలకు ఏం పని? 
జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్దిసేపటికే శ్రీనివాసరావు స్వగ్రామం ఠాణేలంకలో స్థానిక టీడీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు నడింపల్లి శ్రీనివాసరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరావులు అక్కడికి చేరుకుని నిందితుడి కుటుంబ సభ్యులతో అతడిని వైఎస్సార్‌ సీపీ అభిమానిగా చెప్పించేందుకు నానాపాట్లూ పడ్డారు. వారితో ప్రకటనలు ఇప్పించారు. ఇక ముమ్మిడివరం మండల పరిషత్‌ అధ్యక్షుడు పితాని సత్యనారాయణరావు నిందితుడి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. శ్రీనివాసరావు తండ్రి తాతారావు కుటుంబీకులకు చెందిన భూములను సత్యనారాయణ కౌలుకు తీసుకున్నారు. ఆ కుటుంబానికి పలువురు టీడీపీ నేతలతో అనుబంధం ఉంది. ఏ సంబంధమూ లేకపోతే టీడీపీ నేతలు అంత హడావుడిగా నిందితుడి ఇంటికి ఎందుకు వెళ్లారు? వారిని పరామర్శించేందుకా? అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా?: కేవలం ఇంటర్, ఐటీఐ చదివిన నిందితుడికి ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌లో నేరుగా ఉద్యోగం ఇవ్వడమూ సందేహాలకు తావిస్తోంది. శ్రీనివాసరావు జగన్‌ అభిమాని అని చెబుతున్న రెస్టారెంట్‌ యజమాని.. ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తిని రెస్టారెంట్‌లో ఎలా నియమిస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలా చెప్పడం వెనుక పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తుండడంతో తమ బండారం బయటపడుతుందన్న భయంతో విపక్షంపై దుష్ప్రచారం ప్రారంభించారు. విపక్ష నేతపై దాడి చేసేందుకు దీర్ఘకాలంగా పథకం రచించి సమయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

6 సెల్‌ఫోన్లు, 9 సిమ్‌లు మార్చిన నిందితుడు 
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నానికి తొమ్మిది నెలల క్రితమే కుట్ర మొదలైంది.  నిందితుడు ఎనిమిది నెలల క్రితం విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాడు. అందులో ఉద్యోగిగా చేరితే దాడి చేసేందుకు ఇబ్బంది ఉండదనే ఎయిర్‌పోర్టును ఎంచుకున్నాడు. జగన్‌ రాకపోకలను గమనిస్తూ దాడికి సిద్ధమయ్యాడు. నిందితుడు శ్రీనివాసరావు గత తొమ్మిది నెలల్లో ఆరు సెల్‌ఫోన్లు, తొమ్మిది సిమ్‌కార్డులను మార్చాడు. ఈ వ్యవధిలో శ్రీనివాసరావు ఏకంగా పది వేల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్టు కేసును పర్యవేక్షిస్తున్న విశాఖ ఏడీసీపీ మహేంద్రపాత్రుడే స్వయంగా వెల్లడించారు. తన సోదరుడు కొన్నాళ్లుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడడం లేదని, బేసిక్‌ ఫోన్లే వాడుతున్నట్టు శ్రీనివాసరావు అన్న మీడియాకు తెలిపాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement