క్షతగాత్రులు నఫీజా, అష్రఫ్
బి.కొత్తకోట: ఉపవాస దీక్షలు ముగించి, రంజాన్ పండుగ జరుపుకున్న ఓ కుటుంబం విహారయాత్రకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు వచ్చి తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురైన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని హార్సిలీహిల్స్ క్రాస్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు..
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం ముత్తకూరుకు చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ముబారక్‌కు చెందిన ఆటోను అద్దెకు మాట్లాడుకొని హార్సిలీహిల్స్ చేరుకున్నారు. సాయంత్రం ఆరుగంటల వరకు కొండపై విందు భోజనాలు చేసుకొని సేదతీరారు. అనంతరం ఆటోలో గ్రామానికి బయలుదేరారు. 9 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు దాటుకొని హార్సిలీహిల్స్ క్రాస్‌లోకి వస్తున్న ఆటో స్థానికులు చూస్తుండగానే మదనపల్లె రోడ్డు దాటుకొని కోటావూరు వెళ్లే రోడ్డులోని పెద్ద గొయ్యిలో పడింది. ఈ సంఘటన చూస్తున్న స్థానికులు పరుగులు తీసి బాధితులను ఆటో నుంచి వెలుపలికి తీశారు. 12 మందిలో ఆరుగురికి గాయాలుకాగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం కోసం 108కు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటనా స్థలం చేరుకొన్న హైవే పెట్రోలింగ్ వాహనం, మదనపల్లె రూరల్ సీఐ వాహనాల్లో బాధితులను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఎస్.ఫయాజ్(65) తలకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. గఫూర్ (64), సుఫియాబేగం (42), ఫైరోజా (34), నఫీజా (18), అష్రఫ్ (14) గాయపడ్డారు. ఆటోడ్రైవర్ ముబారక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలంలో బండరాళ్లు ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్ కావడమే కారణమని అంటున్నారు. విచారణలో వాస్తవాలు తేలాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment