సాక్షి, గాజువాక: దగ్గరమార్గంలో తీసుకువెళ్తానని నమ్మబలికిన ఆటో డ్రైవర్ ప్రయాణికురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి ఆభరణాలు దోచుకుని ఉడాయించాడు. గాజువాక క్రైం ఎస్‌ఐ తెలిపిన వివరాలిలావున్నాయి. నగరంలోని వడ్లపూడికి చెందిన ఎర్ని కుమారి గురువారం ఉదయం భర్తతో కలిసి మర్రిపాలెంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడ భర్తతో గొడవ పడిన ఆమె రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో పాతగాజువాక వచ్చేసింది. ఒంటరిగా ఉన్న ఆమెను వడ్లపూడికి దగ్గరమార్గంలో తీసుకువెళ్తానని నమ్మించిన ఆటో డ్రైవర్ కొత్తగాజువాక మీదుగా జింక్ గేటు నుంచి మింది బస్టాప్ మీదుగా శ్మశానం వైపు తీసుకువెళ్లాడు.
అక్కడ ఆపి ఆమె నుంచి పుస్తెల తాడు, చెవి దిద్దులు, నల్లపూసలను తెంపే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా రెండున్నర తులాల పుస్తెల తాడు, ఒక చెవిదిద్దు తీసుకొని ఆటోతో పరారయ్యాడు. సంఘటన స్థలంలో పడిపోయిన నల్లపూసలు, ఒక చెవిదిద్దు ఆమెకు దొరికాయి. అక్కడ నుంచి ఆమె కాలినడకన మింది గ్రామం చేరుకుని స్థానికులకు విషయం తెలిపింది. వారు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఈ ఘటనలో కుమారి ముఖం, మెడపై స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించి గాజువాక క్రైం ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment