లారీ కింద పడి మృతి చెందిన చైతన్య
ఆమదాలవలస: ఒక్కగానొక్క కుమారుడు ఆసరాగా నిలబడతాడని కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. పాలు తీసుకువస్తానని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదానికి గురయ్యాడు ఇంజినీరింగ్ విద్యార్థి. ఆమదాలవలస పట్టణ శివార్లలోని వెంగళరావు కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ పరిధి రెండో వార్డు కృష్ణాపురం గ్రామానికి చెందిన సువ్వారి చైతన్య (20) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తమ్మయ్యపేట గ్రామంలో ఉన్న తమ బంధువులు ఇంటి వద్ద నుంచి ప్రతీ రోజు పాలు తీసుకువచ్చేందుకు ఉదయాన్నే దిచక్ర వాహనంపై చైతన్య వెళ్లేవాడు.
శనివారం ఉదయం ఎప్పటిగాలే బయల్దేరి వెళ్లి తిరిగి వస్తుండగా వెంగలరావు కాలనీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ కిందకు ద్విచక్ర వాహనం దూసుకుపోయింది. ఛాతి భాగంపై దెబ్బ తగిలింది, కాలు విరగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో (బలగ సమీపంలో) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఆమదాలవలస పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు
ఒక్కగానొక్క కుమారుడికి ప్రమాదం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మి, రమణారావులు తల్లడిల్లారు. వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి ఎలాగైనా బతికించుకోవాలన్న వారు పడిన తపన స్థానికులను కలిచి వేసింది. చైతన్య ప్రస్తుతం ఎచ్చెర్లలో శ్రీవెంకటేశ్వర కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి లేబర్ మేస్త్రి. తల్లి గృహిణి. అక్కకు ఇటీవల వివాహం జరిగింది. చైతన్య గ్రామంలోని యువకుల అందరితో కలిసిమెలిసి ఉండేవాడని స్నేహితులు తెలిపారు. చైతన్య మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment