ప్రతీకాత్మక చిత్రం
ఢాకా : పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నానే ఆవేదన ఓ వైపు.. ఎంత ప్రయత్నించినా భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదనే ఆవేశం మరోవైపు.. ఈ రెండు భావనల మధ్య నలిగిపోయిన ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడుస్తున్న రెండు నెలల పసికందు నోట్లో ఉప్పు పోసి బిడ్డ చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం... మహ్మద్ బచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మహ్మద్ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల పాప, రెండు నెలల బాబు సంతానం. కాగా గత కొన్ని రోజులుగా మహ్మద్ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం.... తాను దాచుకున్న డబ్బులతో కొడుకు కోసం పాల ప్యాకెట్ తీసుకురమ్మని సాతీ భర్తతో చెప్పింది. కానీ మహ్మద్ ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకుని వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చర్యతో విసిగెత్తి పోయిన సాతీ.. కొడుకు గుక్క పట్టి ఏడుస్తుండటంతో సహించలేకపోయింది.
పేదరికంలో బతికే కంటే చావడమే నయమంటూ ఆవేశంలో చిన్నారి నోట్లో ఉప్పు పోసింది. ‘ఇదే నీకు ఆహారం’ అంటూ పిచ్చిదానిలా ప్రవర్తించింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన సాతీ.. కొడుకును తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తన భార్య కావాలనే కొడుకును పొట్టనబెట్టుందని మహ్మద్ ఫిర్యాదు చేయడంతో సాతీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment