సాక్షి, హైదరాబాద్: బర్కత్‌పురాలో భరత్ అనే యువకుడి పాశవికదాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిన్నటికన్నా ఈ రోజు ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా.. ఇంకా ఆందోళనకరంగానే ఉందని, మరో 48 గంటలు గడిస్తేకానీ పరిస్థితి గురించి చెప్పలేమని యశోదా ఆస్పత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నామని, ఆమె మెదడుకు తీవ్ర గాయాలయ్యాయని, ఆమె కొంత కుదుటపడిన తర్వాత బ్రెయిన్ సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమె శరీరంపై 14 బలమైన కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..)
బుధవారం ఆస్పత్రికి తరలించే సమయానికే ఆమె పల్స్‌రేటు పడిపోయిందని, బీపీ లెవల్స్ కూడా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. భరత్ విచక్షణారహితంగా పొడిచిన కత్తిపోట్లకు బాధితురాలి తలపై భాగంలో పుర్రె రెండుగా చీలిందని, మెదడులోకి కీలక నరాలు తెగిపోయాయని వైద్యులు వెల్లడించారు. అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉందని, మెడపై కూడా తీవ్రమైన గాయం ఉందని చెప్పారు. దవడపై, రెండు చేతుల మణికట్లపై రెండు సెంటీమీటర్ల మేర గాయాలు ఉన్నాయని, ఎడమ చేతివేలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. రక్తస్రావం ఆగి, బీపీ, పల్స్‌రేట్.. సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు సర్జరీ చేస్తామని చెప్పారు.
పక్కా ప్లాన్‌తోనే దాడి
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధులికపై దాడి చేయడానికి రెండు రోజులముందే భరత్ పక్కా ప్లాన్ రూపొందించుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. ఇందుకోసం బర్కత్‌పురాలో కొబ్బరిబోండం కొట్టే కత్తిని అతను దొంగిలించి.. తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోనే ఆ కత్తిని దాచి పెట్టాడని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న మధులికపై అదను చూసి భరత్ దాడి చేశాడని, దాడి అనంతరం తిరిగి తన ఇంట్లో ఎక్కడి నుండైతే కత్తి తీశాడో అక్కడే దాచి పెట్టాడని పోలీసులు గుర్తించారు.
మాకు న్యాయం జరగలేదు: మధులిక తల్లిదండ్రులు
మరోవైపు జనవరి 7నుంచీ తమ కూతురును భరత్ వేధిస్తున్నాడని, అతని వేధింపులపై షీ టీమ్స్ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భరత్ బాబాయి మాజీ పోలీసు ఉద్యోగి అని, అందుకే భరత్‌కు అనుకూలంగా కౌన్సిలింగ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment