బీచ్‌రోడ్డు.. అందాల విశాఖ సుందరి మెడలో అపురూపమైన నగలా భాసిల్లుతున్న ఈ ప్రాంతం విశాఖవాసుల ఆహ్లాదానికి ఆటపట్టు.. పర్యాటకులకు స్వర్గధామం..పగలంతా సముద్ర కెరటాల హోరు.. పర్యాటకుల సందడి కనిపించే బీచ్‌రోడ్డు సాయంత్రమైతే చాలు.. రూపం మార్చుకుంటుంది.. వేల సంఖ్యలో సందర్శకులతో కిటకిటలాడుతుంది. విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతుంది.చిన్నారులు, యువత కేరింతలు, తుళ్లింతలుసముద్రుని హోరును సవాల్ చేస్తాయి..ఆ హోరు.. ఆ జోరు.. ఆ హుషారును ఆదాయ మార్గంగా మలచుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాయి..అయితే.. సందట్లో సడేమియా అన్నట్లు.. వ్యాపారాల ముసుగులో కొందరు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు.. ముఖ్యంగా తినుబండాలు, ఆహార పదార్థాలు మాత్రమే అమ్మే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల పేరుతో లైసెన్సు తీసుకొని నడుపుతున్నవారు.. రాత్రి పొద్దుపోయాక బోర్డు తిప్పేస్తున్నారు.ఫలితం.. హోటళ్లు కాస్త బార్లుగా మారిపోతున్నాయి. కొన్ని బెల్టుషాపుల స్థాయికి కూడా దిగజారిపోతున్నాయి. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో లక్షలు ఆర్జిస్తున్నాయి.బీచ్‌రోడ్డులో నిరంతరం పోలీస్ గస్తీ ఉంటుంది.. అయినా ఈ అక్రమ వ్యాపారాలు వారి కళ్లకు కనపడవు. కారణం.. వేలల్లో అందే మూమూళ్లే..బార్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయాలి.. కానీ అప్పటి నుంచే ఈ అక్రమ వ్యాపారాలు రెక్కలు విచ్చుకోవడం కొసమెరుపు
సాక్షి, విశాఖపట్నం: ఉదయం నుంచి రాత్రి వరకు అవన్నీ సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే.. కానీ రాత్రి 10 గంటలు దాటితే చాలు.. బార్లుగా మారిపోతాయి. బీచ్‌రోడ్డును మద్యంలో ముంచెత్తుతాయి. మద్యం మత్తు మరిగిన యువజనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతాయి. ఈ రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు పలు స్టార్ హోటళ్లతోపాటు సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. స్టార్ హోటళ్లు ముందుగానే అనమతులు తీసుకొని లోపల ప్రత్యేకం బార్లు నిర్వహిస్తుంటాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ఆహార పదార్థాల విక్రయానికి మాత్రమే అనుమతులుండే చాలా రెస్టారెంట్ల నిర్వాహకులు రాత్రి పొద్దుపోయిన తర్వాత వాటిని బార్లుగా మార్చేస్తున్నారు. అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. రాత్రివేళల్లో మద్యానికి బానిసలైనవారు, జల్సాలకు అలవాటు పడిన యువత వీటి వద్దకు చేరుకొని నానా హంగామా చేస్తుంటారు. చాలామంది బీచ్‌లోకి మద్యం బాటిళ్లతో వెళ్లి పూటిగా తాగి ఖాళీ సీసాలను అక్కడే పారేస్తుంటారు.
రాత్రి 11 దాటితే నిషేధం ఎక్కడ?
నగరంలో రాత్రి 11 గంటలకు బార్లతో సహా సాధారణ రెస్టారెంట్లను మూసివేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డును ఆనుకొని ఉన్న సాగరంలో అవన్నీ కలిసిపోతున్నాయి. ఉదయం నుంచీ బిర్యానీలు, ఇతర ఆహార పదార్థాలతో కాలక్షేపం చేసే చాలా రెస్టారెంట్ల నిర్వాహకులు రాత్రి పొద్దుపోయాక అసలు వ్యాపారానికి తెర తీస్తారు.
రాత్రి తెల్లవార్లూ విచ్చలవిడి అమ్మకాలతో లక్షల ఆదాయం వెనకేసుకుంటారు. బీచ్‌రోడ్డు పొడవునా సివిల్‌తోపాటు మెరైన్ పోలీసుల గస్తీ ఉంటుంది. కానీ వారెవరూ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటివైపు కన్నెత్తి చూడరు. లక్షల్లో ఆర్జిస్తున్న హోటళ్ల నిర్వాహకులు పోలీసు అధికారులను వేలల్లో ముట్టజెపుతూ.. వారు తమవైపు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ ధీమాతో మరింత రెచ్చిపోయి.. అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా యువత, వ్యసనపరులు మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా చిందులేస్తుంటే.. మామూళ్ల మత్తులో పోలీసులు వాటిని చూసి ఆనందిస్తున్నట్లుగా పరిస్థితి తయారైంది.
నగరవాసుల ఆందోళన
ఇప్పటికే నగరంలో ప్రశాంతత నానాటికీ చెదిరిపోతోంది. ఒకప్పుడు విశాఖ నగరం.. ప్రత్యేకించి బీచ్‌రోడ్డు ప్రశాంతతకు మారుపేరు. పర్యాటకులు సంగతి పక్కన పెడితే.. సాయంత్రమేతే చాలు వేల సంఖ్యలో నగరవాసులు బీచ్‌రోడ్డుకు కుటుంబ సమేతంగా చేరుకొని కొన్ని గంటలపాటు అక్కడ షికార్లు చేసి సేదదీరుతుంటారు. మరోవైపు బీచ్‌రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో వేల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా నిత్యం బీచ్‌రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలి పరిణామాలు వీరందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నగాక మొన్న రాజకీయ ప్రముఖల విందువిలాసాల కోసం నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది. మరోవైపు డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. వీటికి తోడు బీచ్‌రోడ్డు పొడవునా రాత్రితెలవార్లూ నిర్వహిస్తున్న అనధికార బార్ల కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. రాత్రి వేళల్లో తాగి తందనాలాడే వారి చేష్టలతో ఆ రోడ్డులో తిరిగేందుకే సమీప ప్రాంతాల నివాసులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు బీచ్‌లో ఆడుకునేందుకు తమ పిల్లలను స్వేచ్ఛగా పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు అలా పంపేందుకు జంకుతున్నారు. ఇటువంటి అనైతిక చర్యలను, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు రెస్టారెంట్ల వారి నుంచి మామూళ్లు అందుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment