నిడమర్రు : వేసవి సెలవుల నేపథ్యంలో.. ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో సహా బంధువుల ఊరు వెళుతున్నారా.. తీర్థ యాత్రలకు/విహార యాత్రలకు ప్రయాణం అవుతున్నారా.. అయితే మీ ఇంటిపై దొంగలు ఓ కన్నేస్తారు జర భద్రం.
కనీస జాగ్రత్త చర్యలు తీసుకుని ఊరెళ్లడం మంచిదని నిడమర్రు ఎస్సై ఎం. వీరబాబు సూచిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరువెళ్లే వారి ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఊరెళెతే మరి మన వంతుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఊరెళితే.. చెప్పి వెళదాం...
ఎక్కువ రోజులు ఊరెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లడం మంచిది.నివాస గృహాల ప్రధాన ద్వారాలే కాకుండా లోపల ద్వారాల తలుపులకు కూడా తాళం వేసుకోవాలి. గదుల లోపల ఉన్న కిటీకీలు ఇతర తలుపులకు గెడలు, గొళ్లాలు వేసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఇంటి కాంపౌండ్/పోర్టికో/ముఖద్వారం బయట చీకటి పడితే విద్యుత్ దీపాలు వెలిగేలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికోసం ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకోవచ్చు.
అలానే తాళం వేసిన ద్వారాలకు పరదాలు, డోర్ కర్టెన్లు వేసి ఇంటికి తాళాలు వేసినట్టు కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారు ఊరు వెళుతున్నప్పుడు ప్లాట్ చుట్టుపక్కల ఉన్న వారికి మీ ఫోన్ నంబర్లు ఇచ్చి వెళ్లండి. అపార్ట్‌మెంట్స్‌లోనూ/ఆర్థిక స్తోమతగల వారు మీ ఇంటి వద్ద సీసీ కెమెరా నిఘా పెట్టుకోవడం మంచిది.విలువైన ఆభరణాలు, నగదు వెంట తీసుకు వెళ్లాలి/బ్యాంకు లాకర్ ఉంటే వాటిలో/మీ సన్నిహితుల వద్ద భద్రపర్చుకోవాలి.
ఊరెళ్లే ముందు ద్విచక్ర వాహనాలు ఆరుబయట/ప్రహరీ లోపల వదిలేయకుండా ఏదైనా గదిలో వాహనాలను జాగ్రత్తగా తాళం వేసుకోవాలి/సుపరిచితుల ఇళ్లలో పెట్టి వెళ్లాలి. మీ ద్విచక్ర వాహనాల తాళాలు అరిగిపోతే వెంటనే మార్చుకోండి. మీ ఇంటికి సెంట్రల్ లాంకింగ్ సిస్టంగల తాళం పెట్టించుకోండి. పనిమనిషి ఉంటే రోజూ గుమ్మం ముందు ముగ్గు వేయించే ఏర్పాటు చేసుకోవాలి.బస్సులలో, ట్రైన్లలో అపరిచితులు ఏమైనా తినుబండారాలు ఇచ్చినా వాటిని మీరు తినవద్దు. వాటిలో మత్తు మందు కలిపే అవకాశం ఉంది.
మరిన్ని జాగ్రత్తలు ఇలా
వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఉన్నప్పుడు వారిని ఒంటరిగా ఇంటిలో ఉంచరాదు. అలాగే ఒంటరిగా బయటకు పంపరాదు.ఇంటి లోపల పడుకున్నప్పుడు లోపల నుంచి డోర్స్ లాక్ చేసుకోవటం మర్చి పోవద్దు. విద్యుత్ కోతల నేపథ్యంలో మహిళలు బంగారు నగలు ధరించి ఇంటి బయటగానీ, డాబా మీదగాని పడుకోవద్దు. ఆభరణాలకు మెరుగులు పెడతామని/ రంగులు అద్దుతాం అంటూ ఇళ్లకు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సాధ్యమైనంత వరుకూ వారి ప్రాంతం గుర్తింపు కార్డులు అడిగి వాటిని పరిశీలించాలి. అనుమానం ఉంటే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వండి. రాత్రిపూట ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మహిళలు వీలైనంత తక్కువ విలువ గల ఆభరణాలు ధరించాలి. అవసరమైతే భుజం పైనుంచి కొంగు కప్పుకుని వెళ్లండి.!
Comments
Please login to add a commentAdd a comment