రాపిడో డ్రైవర్(ఫైల్ ఫోటో)
సాక్షి, బెంగళూరు: బైక్ సేవల సంస్థ రాపిడో డ్రైవర్లపై దాడి చేసి దోచుకున్న ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లను బెదిరించి డబ్బు, మొబైల్, బ్యాంకు కార్డులను ఎత్తుకుపోయారు. ఈ రెండు ఘటనలు సోమవారం ఉదయం బెంగళూరు నగరంలో చోటు చేసుకున్నాయి.
బెంగళూరులోని ధానేశ్వర్ బేకు హోసూర్ రోడ్‌లోని కుడ్లు గేట్ సమీపంలో ని ఘటనలో డ్రైవర్‌ను ఎత్తుకుపోయి మరీ చోరీకి పాల్పడ్డారు. రాపిడో డ్రైవర్ ధనేశ్వర్ (37) యాప్ ద్వారా వచ్చినసమాచారం ప్రకారం కస‍్టమర్‌ను పికప్ చేసుకునేందుకు సంబంధిత ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఒక వ్యక్తి కత్తితో ఎటాక్ చేసి డ్రైవర్ మెడ కోశాడు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లు, రూ .1200 నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు, పవర్ బ్యాంక్ లాక్కున్నాడు. అనంతరం ధనేశ్వర్‌ను బలవంతంగా మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు దుండగులు పొంచి వున్నారు. ఈ ముగ్గురూ కలిసి ధనేశ్వర్‌ను కొట్టి మరీ ఏటీఎం కార్డు పిన్ అడిగి రూ .500 డ్రా చేశారు. గూగుల్ పే ద్వారా రూ .165 బదిలీ చేయమని బలవంతం చేశారు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బుకోసం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఎలాగోలా ధనేశ్వర్ అక్కడినుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన మరో సంఘటనలో, మరో రాపిడో డ్రైవర్ అమల్ సింగ్ (27) ను ముగ్గురు వ్యక్తులు ఇదే విధంగా కత్తితో బెదిరించి, దోచుకోవడం గమనార్హం. పరప్పన అగ్రహార సమీపంలో ఉన్న పికప్ పాయింట్ వద్దకు అమల్‌సింగ్ చేరుకోగానే, ముగ్గురు సాయుధ వ్యక్తులు అతడిపై మూకుమ‍్మడిగా దాడిచేసి మొబైల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు ఉన్న వాలెట్ , ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులే ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment