
బాధితులతో వివరాలు తెలుసుకుంటున్న సీఐ రాజగోపాల్‌నాయుడు
డోన్ రూరల్ : పట్టణంలోని ఓనెరో పాఠశాల వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ఓనెరో పాఠశాల సమీపంలో లక్ష్మిదేవి అనే మహిళ కుమారుడు మనోహర్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఉంటోంది. మంగళవారం సాయంత్రం పనిపై కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు అదే రోజు రాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోఉన్న రెండు బీరువాను పగులగొట్టి అందులో ఉన్న దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మిదేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం ఉదయం వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనస్థలికి చేరుకుని బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
ఆధారాలు దొరక్కుండా..
దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు దొరకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఘటనస్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే చోరీ చేసేందుకు తీసుకొచ్చిన పికాసి, ఒక రాడ్డు, ఒక కట్టె, పండ్ల స్పానర్‌ను ఘటన స్థలంలోనే వదిలివెళ్లారు. సీసీకెమెరాల ఫుటేజీ దొరకకుండా ఉండేందుకు ఏకంగా హార్డ్‌డిస్క్‌నే ఎత్తుకెళ్లారు. పోలీసులు కర్నూలు నుంచి క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించారు.
భయం గుప్పిట్లో ప్రజలు...
పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కొండపేటకు చెందిన మంగళి ప్రసాద్ ఇంట్లో 15 తులాల బంగారు, రూ.70 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఏప్రిల్ 1న ఇందిరానగర్‌కాలనీలో ఉపాధ్యాయుడు గోపాల్‌శర్మ ఇంట్లో 60 తులాల బంగారు, రూ.7 లక్షల నగదు చోరీకి గురైంది. అలాగే స్థానిక గాందీ సర్కిల్‌లో ఉన్న శివ జ్యువెలర్స్‌లో 30 తులాల బంగారు కేజీ వెండిని ఎత్తుకెళ్లారు.
రైల్వే ఉద్యోగి ఇంట్లో కూడా 8 తులాల బంగారును దొంగలించారు. చోరీలు జరిగిన సమయంలో విచారణ పేరుతో హడావుడి చేయడం తప్ప పోలీసులు ఏం చేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. దొంగతనాల కేసుల్లో ఒక్కదానిలో కూడా పురోగతి లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment