వై.కొత్తపల్లిలో బిహార్ దొంగలను పట్టుకున్న గ్రామస్తులు
తూర్పుగోదావరి, పి.గన్నవరం: బంగారు నగలకు మెరుగు పెడతామని మోసాలకు పాల్పడుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని వై.కొత్తపల్లి గ్రామస్తులు మంగళవారం పట్టుకున్నారు. వారిలో ఒకరు పరారయ్యాడు. ఒక మహిళ బంగారు తాడుకు మెరుగు పెడతామని, దానిని ద్రావకంలో కరిగించి తొమ్మిది గ్రాముల బంగారాన్ని తస్కరించిన వారు గ్రామస్తులకు చిక్కారు. వీరిని పి.గన్నవరం పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం భాగల్‌పూర్ జిల్లాకు చెందిన రబీన్, రామ్‌లకేన్, రంజిత్, కుందన్ రెండు రోజుల క్రితం అనంతపురం వచ్చారు. అక్కడి నుంచి మంగళవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి, అమలాపురం మీదుగా వై.కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన నల్లా త్రివేణి ఇటీవల వై.కొత్తపల్లి గ్రామంలోని పుట్టింటికి వచ్చింది.
త్రివేణి, ఆమె చెల్లెలు ఇంట్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి.. తాము ఇత్తడి సామాన్లకు, బంగారు నగలకు మెరుగుపెట్టే పౌడర్లు అమ్ముతామని, ప్రస్తుతం పౌడర్లు అయిపోయాయని, రెండు రోజుల్లో పట్టుకువస్తామని చెప్పాడు. త్రివేణి వెండి పట్టీలకు మెరుగుపెట్టి ఇచ్చాడు. దీంతో ఆమె.. అతడిని నమ్మి 20 గ్రాముల బంగారు తాడును ఇచ్చింది. దానిని ద్రావకంలో వేసి మెరుగుపెట్టి పసుపు రాసి ఇచ్చి, రోడ్డుమీదకు వెళ్లాడు. ఈలోగా వినాయకుడి గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని గ్రామస్తులు నిలదీస్తున్నారు. అదే సమయంలో త్రివేణి బంగారు తాడు తరిగిపోయిందని లబో దిబోమంటూ రోడ్డుపైకి రావడంతో, తాడును కరిగించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఈలోపు నలుగురు దొంగల్లో ఒకడు పారిపోయాడు. తాము దొంగతనాలు చేసేందుకే వచ్చినట్టు వారు చెప్పారని గ్రామస్తులు వివరించారు. సర్పంచి చింతా సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు శేరు శ్రీనుబాబులకు సమాచారం అందించగా ముగ్గురు దొంగలను వారు పోలీసులకు అప్పగించారు. బిహర్‌కు చెందిన దొంగలు సంచరిస్తున్నారన్న విషయంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment