నగరంలో బిహార్‌ ముఠా..? | Bihar Gang In Visakha City | Sakshi
Sakshi News home page

నగరంలో బిహార్‌ ముఠా..?

Published Mon, May 14 2018 12:05 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

Bihar Gang In Visakha City - Sakshi

కొద్ది నెలల కిందట పోలీసులు అరెస్ట్‌ చేసిన బిహార్‌ ముఠా సభ్యులు

విశాఖ క్రైం: విశాఖలో పలు దొంగతనాలకు పాల్ప డుతున్న బిహార్‌కు చెందిన ముఠాలు నగరంలో తిరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... గడిచిన రెండు రోజుల నుంచి పెదజాలారిపేట, లాసన్స్‌బే కాలనీ, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు, ఈస్టుపాయింట్‌ కాలనీ, బీచ్‌రోడ్డులో బిహార్‌ ముఠా సభ్యులు సంచరిస్తున్నారు. శనివారం రాత్రి ఈ ముఠాలోని ఇద్దరు దొంగలు పెదజాలారిపేట నుంచి లాసన్స్‌బే కాలనీ వైపు వెళ్తూ మధ్యలో ఓ ఫంక్షన్‌ వద్ద ఆగి భోజనం పెట్టాలని అడిగారు. దీంతో నిర్వాహకులు భోజనం పెట్టారు. ఆ సమయంలోనే బిహార్‌ ముఠా నగరంలో సంచరిస్తున్నట్లు వారి ఫొటోలు వాట్సాప్‌ గ్రూపులకు మెసేజ్‌లు వచ్చాయి. వివాహ వేదిక వద్ద ఉన్న వారు ఆ ఫొటోలు చూసి అప్రమత్తమయ్యారు.

భోజనం చేస్తున్న యువకుల ఫొటోలతో ముఠాలోని సభ్యుల ఫొటోలు సరిపోలడంలో పట్టుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ఒక యువకుడు పట్టుబడగా మరో యువకుడు పరారయ్యాడు. పట్టుబడిన యువకుడిని పోలీసులు రక్షక్‌ వాహనంలో స్టేషన్‌కు తరలించాలని స్థానికులు తెలిపారు. ముఠా సభ్యులంతా ముందుగా రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

వరుస చోరీలతో బెంబేలు
వరుస చోరీలతో బిహార్‌ ముఠాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. 2017 డిసెంబర్‌ 7వ తేదీన ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 5లో పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో రిటైర్డు ఉద్యోగిని ఫిస్టల్స్‌తో బెదిరించి బంగారం దోచుకున్నారు.
ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2017 జూలై 11న ఆరుగురు  సభ్యుల బిహార్‌ ముఠా ఇంటిలోకి చొరబడి 20 తులాల బంగారం, వంద తులాలు వెండి దోచుకుపోయారు.
అనకాపల్లి సమీప ఉమ్మలాడ గ్రామంలో 2017 జూలై 24న  ఇంటిలోకి చొరబడి 8 తులాల బంగారం, రూ.2.8 లక్షల నగదు అపహరించుకుపోయారు.
నగర పోలీసులు కొద్ది నెలలు క్రితం బిహార్‌ గ్యాంగ్‌ని పట్టుకున్నారు. 14 మంది మూఠా సభ్యుల నుంచి మూడు తపంచాలు, ఒక కత్తి, ఏడు రౌండ్లు బుల్లెట్లు, 10 తులాల బంగారు ఆభరణాలు, 1.2 కిలోల వెండి, మూడున్నర కిలోల గంజాయి, ఒక కారు, ఆటో, 2 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరిలోవ సమీపంలో తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన వారిలో మహ్మద్‌ ఆలీ, రణధీర్‌కుమార్, రీతమ్‌కుమార్‌సింగ్, సుజిత్‌కుమార్‌ యాదవ్, బబ్లూ కుమార్, ముఖేష్, రాజేష్‌కుమార్‌ యాదవ్, బాబులు ఉన్నారు.

ఉలిక్కిపడుతున్న నగరవాసులు
నగరంలో బిహార్‌ గ్యాంగ్‌ సంచరిస్తోందన్న సమాచారంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ముఠా సభ్యులు నగరంలోకి శనివారం వచ్చారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement