ప్రతీకాత్మక చిత్రం
పట్నా: దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలిచి దేవతకు అర్పించింది. అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటన బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేసేది. ఏడోరోజైన ఆదివారం అమ్మవారికి పూజలు జరుగున్న సమయంలో.. కుమారి తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించేయత్నం చేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడు సహా అందరూ స్థాణువైపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.
దుర్గామాత చెప్పిందనే..: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న కోమల్ కుమారి.. గత కొద్ది రోజులుగా విచిత్రంగా మాట్లాడినట్లు తెలిసింది. దుర్గామాత కలలోకి వచ్చేదని, ఏదో ఒక అవయవాన్ని అర్పించమనేదని కుమారి తన స్నేహితురాళ్లతో చెప్పుకునేది. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. బాలిక ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం’’అని దర్భాంగ జిల్లా వైద్యాధికారి సంతోశ మిశ్రా అన్నారు.
ఇది మూర్ఖత్వం.. మానసిక రుగ్మత: తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్‌నాథ్ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇవాళ కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి(కోమల్) నిజం కళ్లనే పెకిలించుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను కళ్లు, ఇతర అవయవాలు ఇవ్వమని కోరదు’ అని ఝా అన్నారు. ‘‘బాలిక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. మూఢనమ్మకాలకు సంబంధించి ఇది తీవ్రమైన కేసు’’ అని పట్నాకు చెందిన మానసిక వైద్యుడొకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment