
స్వాధీనం చేసుకున్న శంఖం, పుర్రెల దండ, డమరుకం
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని కేతవరం పంచాయతీ కృష్ణంపాలెంలో చేతబడి పూజలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఐదుగురు వ్యక్తులను పట్టుకుని శనివారం అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. గత వారం రోజులుగా ఒక ఇంటిలో రాత్రివేళల్లో పెద్దగా శబ్దాలు వినపడటం, మంత్రాలు చదవడం వంటివి జరుగుతూ వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి వలంటీర్ల సహాయంతో పూజలు చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో మాలలు, పుర్రె దండలు, తాయిత్తులు పసుపు, కుంకుమ వంటివి లభించడంతో చేతబడి చేస్తున్నారని అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పూజలు చేస్తున్నవారంతా పలు ప్రాంతాల నుంచి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు.