
సినిమా థియేటర్లు టెంట్ నుంచి మల్టీప్లెక్స్ స్థాయికి మారినా.. బ్లాక్ టికెట్ల వ్యాపారం మాత్రం మారలేదు. నగరంలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. పెద్ద హీరోల సినిమా రిలీజ్ టికెట్ల మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటర్ నిర్వాహకుల కనుసన్నల్లోనే దందా సాగుతోందనేది సామాన్యుడి ఆవేదన. టికెట్ ధర రూ.200 ఉంటే అదే బ్లాక్‌లో రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. హీరోల అభిమానులు ఎలాగైనా తొలి షో చూడాలన్న ఆరాటంతో బ్లాక్‌లోనే టికెట్లు కొని చూడాల్సి వస్తోంది. ఈ బ్లాక్ దందాను పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు వారీగా పోలీస్‌స్టేషన్లకు థియేటర్ నిర్వాహకుల నుంచి టికెట్లు స్టేషన్‌కు వెళ్తుండడంతో పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బ్లాక్ టికెట్ల మాఫియా గుట్టును రట్టు చేశారు.
సాక్షి, నెల్లూరు: ప్రాపంచిక జీవనాన్ని సాగించే సగటు జీవికి మానసికోల్లాసాన్ని ఇచ్చే వినోదం ‘సినిమా’ ప్రియంగా మారింది. సామాన్యుడికి భారంగా మారింది. కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లు థియేటర్‌లోకి వెళ్లక ముందే ప్రేక్షకులకు సినిమా చూపిస్తున్నాయి. పండగలు, సెలవులు, వారాంత రోజుల్లో సినిమాకు వెళ్లాలంటే సామాన్యుడికి టికెట్లు దొరకడం కష్టం. ముందుగానే టికెట్లు బ్లాక్ అయిపోతాయి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఇక చెప్పనక్కర లేదు. పెద్ద పెద్ద సిఫార్సులు ఉన్న వారికే టికెట్లు కేటాయింపు ఉంటుంది. సామాన్యులు మాత్రం సినిమా చూడాలంటే బ్లాక్ రేట్లకు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా హీరో మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అలా.. వైకుంఠపురం, రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. పండగ సెలవులు రావడంతో ఆయా సినిమాలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ హీరోల ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు సినిమాలు చూడాలనే కాంక్షతో టికెట్ల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా నిర్వాహకులు ఆన్‌లైన్‌లో టికెట్లను బ్లాక్ చేసి చూపించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయాలు చేయించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు ఖాళీ కనిపించినా.. టెక్నికల్‌గా బుకింగ్ కాకుండా చేయడంతో బ్లాక్‌లోనే టికెట్లు కొని సినిమా చూడాల్సి వచ్చింది. పలుకుబడి ఉన్న వారికి మాత్రం హాలులో టికెట్లు విక్రయించారు. సినిమా టికెట్ రూ.200 వంతున వసూలు చేసిన నిర్వాహకులు బ్లాక్‌లో మాత్రం రూ.1000 వంతున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతున్నా థియేటర్ నిర్వాహకులు పలుకుబడితో ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఏడాదికి బ్లాక్ టికెట్ల మాఫియా ద్వారా రూ.లక్షల్లో సంపాదిస్తున్నట్లు సమాచారం
పోలీస్‌స్టేషన్లకు టికెట్లు
క్రేజ్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే మాత్రం స్థానిక పోలీసులకు టికెట్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు 40 టికెట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు బ్లాక్‌లో టికెట్లు విక్రయాలపై కనెత్తి చూడని పరిస్థితి. బ్లాక్ టికెట్ల మాఫియా ఆగడాలు శృతి మించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బ్లాక్ దందా ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు థియేటర్ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment