Black Tickets
-
హెచ్‌సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్‌పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
IND VS AUS 3rd T20: వేలల్లో టికెట్లు.. కోట్లలో బెట్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. -
ఆర్ఆర్ఆర్ మేనియా.. ఒక్క టికెట్ రూ. 3వేలా?
'రౌద్రం రణం రుధిరం'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2018 నవంబర్ 11న ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగేళ్ల కష్టం అనంతరం ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా గురించే కాకుండా ఆర్ఆర్ఆర్ టికెట్ రేటు కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ చేశారని సినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మల్టీఫ్లెక్సుల్లోనూ టికెట్స్ బ్లాక్ చేయడంతో కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. గత వారం రోజులుగా ట్రై చేస్తున్నా టికెట్స్ అందుబాటులో లేవని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ను రూ. 3వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
బ్లాకులో టిక్కెట్లు అమ్ముకోవడానికి పోరాటమా?
-
'బ్లాక్'లో సినిమా చూపిస్తం!
సినిమా థియేటర్లు టెంట్ నుంచి మల్టీప్లెక్స్ స్థాయికి మారినా.. బ్లాక్ టికెట్ల వ్యాపారం మాత్రం మారలేదు. నగరంలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. పెద్ద హీరోల సినిమా రిలీజ్ టికెట్ల మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటర్ నిర్వాహకుల కనుసన్నల్లోనే దందా సాగుతోందనేది సామాన్యుడి ఆవేదన. టికెట్ ధర రూ.200 ఉంటే అదే బ్లాక్‌లో రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. హీరోల అభిమానులు ఎలాగైనా తొలి షో చూడాలన్న ఆరాటంతో బ్లాక్‌లోనే టికెట్లు కొని చూడాల్సి వస్తోంది. ఈ బ్లాక్ దందాను పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు వారీగా పోలీస్స్టేషన్లకు థియేటర్ నిర్వాహకుల నుంచి టికెట్లు స్టేషన్‌కు వెళ్తుండడంతో పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బ్లాక్ టికెట్ల మాఫియా గుట్టును రట్టు చేశారు. సాక్షి, నెల్లూరు: ప్రాపంచిక జీవనాన్ని సాగించే సగటు జీవికి మానసికోల్లాసాన్ని ఇచ్చే వినోదం ‘సినిమా’ ప్రియంగా మారింది. సామాన్యుడికి భారంగా మారింది. కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లు థియేటర్లోకి వెళ్లక ముందే ప్రేక్షకులకు సినిమా చూపిస్తున్నాయి. పండగలు, సెలవులు, వారాంత రోజుల్లో సినిమాకు వెళ్లాలంటే సామాన్యుడికి టికెట్లు దొరకడం కష్టం. ముందుగానే టికెట్లు బ్లాక్ అయిపోతాయి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఇక చెప్పనక్కర లేదు. పెద్ద పెద్ద సిఫార్సులు ఉన్న వారికే టికెట్లు కేటాయింపు ఉంటుంది. సామాన్యులు మాత్రం సినిమా చూడాలంటే బ్లాక్ రేట్లకు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా హీరో మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అలా.. వైకుంఠపురం, రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. పండగ సెలవులు రావడంతో ఆయా సినిమాలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ హీరోల ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు సినిమాలు చూడాలనే కాంక్షతో టికెట్ల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా నిర్వాహకులు ఆన్లైన్లో టికెట్లను బ్లాక్ చేసి చూపించి బ్లాక్మార్కెట్లో విక్రయాలు చేయించారు. ఆన్లైన్లో టికెట్లు ఖాళీ కనిపించినా.. టెక్నికల్‌గా బుకింగ్ కాకుండా చేయడంతో బ్లాక్‌లోనే టికెట్లు కొని సినిమా చూడాల్సి వచ్చింది. పలుకుబడి ఉన్న వారికి మాత్రం హాలులో టికెట్లు విక్రయించారు. సినిమా టికెట్ రూ.200 వంతున వసూలు చేసిన నిర్వాహకులు బ్లాక్‌లో మాత్రం రూ.1000 వంతున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతున్నా థియేటర్ నిర్వాహకులు పలుకుబడితో ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఏడాదికి బ్లాక్ టికెట్ల మాఫియా ద్వారా రూ.లక్షల్లో సంపాదిస్తున్నట్లు సమాచారం పోలీస్స్టేషన్లకు టికెట్లు క్రేజ్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే మాత్రం స్థానిక పోలీసులకు టికెట్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు 40 టికెట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు బ్లాక్‌లో టికెట్లు విక్రయాలపై కనెత్తి చూడని పరిస్థితి. బ్లాక్ టికెట్ల మాఫియా ఆగడాలు శృతి మించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బ్లాక్ దందా ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు థియేటర్ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. -
జోరుగా బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలు
-
బ్లాక్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది సమరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను వీక్షించాలని భావించిన వేలాది మంది నగరవాసులకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదనే తెలుస్తోంది. అయితే మరోవైపు కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ టికెట్లను ముందుగానే బ్లాక్ చేశారు. స్టేడియం చుట్టు నంబర్ ప్లేట్లు లేని బైక్‌లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను ఐదు వేలకు, రెండు వేల టికెట్‌ను పదివేలకు అమ్ముతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలస్తోంది. టికెట్లు బ్లాక్‌లో దర్శనమివ్వడంతో మ్యాచ్ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో లభించాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఈవెంట్స్ నౌ సంస్థ బుకింగ్ క్లర్కులు కాగా, మరొకరు కౌంటర్ వద్ద ఏజెంట్ కావడం గమనార్హం. డీసీపీ పి.రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుకారాంగేట్‌కు చెందిన రంజిత్ కుమార్ రే, యాప్రాల్ వాసి ఆర్.వరుణ్‌కుమార్ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లోని ఈవెంట్స్ నౌ సంస్థ కౌంటర్లో బుకింగ్ క్లర్కులుగా పని చేస్తున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన ఎ.రాహుల్ చారి ఇదే స్టేషన్‌లోని కౌంటర్ వద్ద ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కోటికెట్టును రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.37,500 నగదు, 16 ఐపీఎల్ టిక్కెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
యాజమాన్యాల 'చిత్ర'హింస..
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను బాక్ల్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ టికెట్ల దందా చేస్తూ కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతున్నాయి. మరుసటి రోజు శని, ఆదివారాలు కావడంతో ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ మూడు రోజుల్లో థియేటర్ల కౌంటర్లలో ఒక్క టికెట్ కూడా విక్రయించడంలేదు. నాలుగు ఆటల టికెట్లు అయిపోయాయని థియేటర్ల వద్ద బోర్డులు పెడుతున్నారు. ఎవరైనా ప్రేక్షకులు అడిగితే ఆన్లైన్లో అన్నీ విక్రయించామని థియేటర్ల మేనేజర్లు చెబుతున్నారు. థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల దందా రెండు విధాలుగా జరుగుతోంది. నాలుగు షోల టికెట్లను బ్లాక్ చేస్తున్న యాజమాన్యాలు వాటిని గంపగుత్తగా బయట వ్యక్తులకు విక్రయిస్తున్నాయి. రూ.110 టికెట్లను రూ.160లకు, రూ.40 టికెట్లను రూ.70కు విక్రయిస్తున్నారు. వారు రూ.110 టికెట్లు డిమాండ్‌ను బట్టీ రూ.200లకు పైగా విక్రయిస్తున్నారు. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు తమ సిబ్బందితోనే రెట్టింపు ధరలకు టికెట్లు బ్లాక్‌లో అమ్మిస్తున్నాయి. శుక్రవారం విడుదలైన భాగమతి, పద్మావత్ చిత్రాల ప్రదర్శిస్తున్న థియేటర్లలో సూర్యా మినీ, సూర్యా కాంప్లెక్స్, శ్యామలా, స్వామి, శివజ్యోతి, రాజా థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయించారు. రూ.110 టికెట్లు రూ.200 నుంచి రూ.300, రూ.40 టికెట్లు రూ.100 లెక్కన అమ్మి ప్రేక్షకులను నిలువదోపిడీ చేశారు. నలుగురు సభ్యుల కుటంబంతో వెళ్లిన వారు రూ. టికెట్లకే రూ.800 నుంచి రూ.1200 వరకు వెచ్చించాల్సి వచ్చింది. అంత మొత్తం వెచ్చించలేని సామాన్యులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. 50 శాతం నిబంధన ఎక్కడ? థియేటర్లలోని టికెట్లలో 50 శాతం ఆన్లైన్లో విక్రయించేందుకు అనుమతి ఉంది. మిగతా 50 శాతం టికెట్లు కౌంటర్లలో విక్రయించాలి. కానీ ఎక్కడా ఇది అమలు కావడంలేదు. వంద శాతం ఆన్లైన్లో పెడుతున్నామని సూర్యా కాంప్లెక్స్ మేనేజర్ చెబుతున్నారని రమేష్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నారు. తాము కుటుంబంతో సహా వచ్చామని, సినిమా చూడకపోతే పిల్లలు నిరాశ చెందుతారని బ్లాక్‌లో రూ.110 టికెట్లు రూ.200లకు కొనుగోలు చేశానని శనివారం ‘సాక్షి’ వద్ద వాపోయారు. సామాన్యులకు టికెట్లు అందేలా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రేక్షకులు కోరుతున్నారు. -
బాహు బలమెంత
-
బ్లాక్‌బలి
- రూ. 500 పలికిన బాహుబలి సినిమా టికెట్ – నిబంధనలు పాటించని థియేటర్ల నిర్వాహకులు – ఆన్లైన్ పేరుతో అడ్డగోలు దోపిడీ - పడిగాపులు కాసినా ప్రేక్షకుడికి దొరకని టికెట్ - ఆనంద్ థియేటర్ వద్ద అభిమానులు గొడవ కర్నూలు సీక్యాంప్: బాహుబలి సినిమా థియేటర్ నిర్వాహకులకు కాసులు కురిపించింది. ఈ సినిమాను చూసేందుకు శుక్రవారం తెల్లవారుజామున నుంచే అభిమానులు నగరంలోని వెంకటేష్, రాజ్, శ్రీరామ, ఆనంద్ సినిమా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా కౌంటర్లలో టికెట్లు దొరకని దుస్థితి. ఈ చిత్రం విడుదలైన దాదాపు పది థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సినిమా టికెట్స్ మొత్తం ఆటకు ముందు రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలి. వారు టికెట్లను పంపిణీ చేయాలి. అందుకు విరుద్ధంగా కొన్ని థియేటర్ల నిరా్వహకులు టికెట్స్ మొత్తం ఆన్లైన్లో బుక్ అయ్యాయని చెప్పి దోపిడీకి దిగాయి. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఆనంద్ థియేటర్ ఎదుట ఉదయం గొడవకు దిగారు. క్లాస్ టికెట్ ధర రూ.100 అయితే రూ. 500, ఆపై, మాస్ టికెట్ రూ.60 ఉండగా రూ. 250, ఆపై ధరకు నిర్వాహకులే దగ్గరుండి అమ్మిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే బ్లాక్‌లో టికెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
సహోరే బాహుబలి
ఇరు రాష్ట్రాల్లో బాహుబలి మేనియా.. - థియేటర్ల ముందు చాంతాడులా లైన్లు - ఆన్లైన్లో 5 రోజుల వరకూ టికెట్లు నిల్.. హైదరాబాద్: బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ప్రస్తుతం అందరూ ఇదే పేరు స్మరిస్తున్నారు. బాహుబలి మేనియాతో యావత్ దేశం ఊగిపోతోంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ మినహాయింపు కాదు. ఒక్క చాన్స్ అన్నట్టుగా.. ఒకే ఒక్క టికెట్ అంటూ ఇప్పుడు యువత థియేటర్ల ముందు వెంపర్లాడుతోంది. స్నేహితులు.. తెలిసిన వారు కలిస్తే ఇప్పుడు వినిపిస్తున్న మాట.. ‘‘బాహుబలి టికెట్ దొరికిందా..!’’ అనే.. ఈ ఒక్క ఉదాహరణ చాలు బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా పై హైప్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. శుక్రవారం ఏకంగా 8 వేల థియేటర్లలో విడుదలవుతోంది. ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్నా.. బాహుబలి టికెట్ దొరకడం గగనమైపోతోంది. చిన్నా చితకా థియేటర్లలోనే కాదు.. బడా మల్టీప్లెక్సుల్లోనూ ఇదే పరిస్థితి. శుక్రవారం సినిమా విడుదల అవుతుండగా.. గురువారం తెల్లవారుజాము నుంచే ఆయా థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పంజగుట్ట పీవీఆర్ సినిమాస్, బంజారాహిల్స్‌లోని ఐనాక్స్, సినీమ్యాక్స్ పీవీఆర్ సినిమాస్, ఐమాక్స్‌లోనూ టికెట్ల కోసం వేలాది మంది క్యూ కట్టారు. ఒక్క టికెట్ సాధించడానికి ఎనిమిది గంటల పాటు లైన్లో నిల్చున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు ఆన్లైన్లో టికెట్ తీసుకుందామని ట్రై చేస్తున్నా.. సర్వర్లు మొరాయిస్తున్నాయి. నెట్లో ఉన్న ఆ కొన్ని టికెట్లు కూడా ఐదు ఆరు రోజుల వరకూ బుక్ అయిపోయాయి. అయినా సరే టికెట్లు దక్కించుకునేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు విశాఖ, విజయవాడ ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. గురువారం రాత్రి పలు పట్టణాల్లో బెనిఫిట్ షోలు వేశారు. టికెట్ రూ.800 నుంచి 1500 వరకూ విక్రయించారు. ఏపీలోని పలు చోట్ల అభిమానులను అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీచార్జి చేశారు. జోరందుకున్న ‘బ్లాక్’ ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత బ్లాక్‌లో టికెట్లు అమ్మే పరిస్థితి తగ్గిపోయింది. కానీ బాహుబలితో మళ్లీ బ్లాక్ టికెట్ల అమ్మకం జోరందు కుంది. పైరవీలు, పలుకుబడి ఇలా ఏదోలా టికెట్లను చేజిక్కించుకోవడం.. వాటిని స్పెషల్ టికెట్లు.. కాంబో ఆఫర్లు అంటూ అంటగట్టడం నయా ట్రెండ్. బాహుబలి టికెట్ కోసం డిమాండ్ తారస్థాయికి చేరింది. చివరకు థియేటర్ యాజమాన్యాలు సైతం చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తింది. శుక్రవారం సినిమా విడుదల కానుండగా ఆదివారం వరకు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు నెల రోజులుగా బోసిపోయిన థియేటర్లకు బాహుబలి రాకతో కొత్త కళ వచ్చింది. బాహుబలి పుణ్యమా అని థియేటర్ల మీదకు జనం ఎగబతున్నారు. కాగా. మోసపూరిత ప్రకటనలతో జనంలో ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి విమర్శించారు. ‘రూ.800 నుంచి వెయ్యి వరకూ టికెట్లు అమ్ముతున్నారు. ఈ ధోరణి పెరిగితే.. ఇక ధియేటర్లకు జనం రారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
జనతాగ్యారేజ్ బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నవ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతాగ్యారేజ్ చిత్రం గురువారం విడుదలైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులతోపాటు సినిమా చూసేందుకు వచ్చిన వారికి సదరు టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
జనతా గ్యారేజ్.. కాంబో ప్యాకేజ్ !
థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్ విక్రయాలు విజయవాడలో మల్టీప్లెక్స్‌ల మాయాజాలం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అ‘ధనం’ తప్పనిసరి స్నాక్స్ పేరిట అడ్డగోలు దోపిడీ విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టికెట్లు బ్లాకులో హల్చల్ చేస్తున్నాయి. గురువారం విడుదల కానున్న ఈ చిత్రం టికెట్లకు బ్లాక్‌లో డిమాండ్ పెరిగింది. విజయవాడలో ఒక్కో టికెట్ ధర రూ. రెండున్నర వేలు పలుకుతోంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే వంద థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరుసటి రోజు నుంచి 25 థియేటర్లలో ఆడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లలో బుధవారం నుంచే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అభిమానులు, పార్టీ నాయకులు ఇలా ఆన్లైన్లో ముందస్తు అమ్మకాలు సాగించారు. అడ్వాన్స్ బుకింగ్లోనూ అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక ధరనిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. కాంబో ప్యాక్ పేరుతో రకరకాల తినుబండారాలు అంటగట్టేవిధంగా ప్యాకేజీ నిర్ణయించి అధిక ధరలు గుంజారు. అన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకూ అదనంగా మరో రూ. 130 వసూలు చేశారు. కాంబో ప్యాక్ ధర చెల్లిస్తేనే ఆన్లైన్ టికెట్లు ఇస్తామని బుకింగ్‌లలో సిబ్బంది తెగేసి చెప్పేశారు. కొత్త సినిమా చూడాలన్న తాపత్రయంతో ఉన్న ప్రేక్షకులు అధిక ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక సాధారణ థియేటర్ల వద్ద కూడా బ్లాకులో విక్రయాలు సాగించారు. థియేటర్ల వద్ద కోలాహలం .. : జనతా గ్యారేజీ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ నగరంతోపాటు, జిల్లాలోని పలు థియేటర్ల వద్ద బుధవారం నుంచే సందడి నెలకొంది. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, ప్రాంతాలలోని థియేటర్ల వద్ద టికెట్ల అమ్మకాల కోలాహలం కనిపించింది. కొన్ని థియేటర్ల వద్ద ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతుండగా, మరికొన్ని థియేటర్లలో బుకింగ్‌ల ద్వారా టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అభిమాన సంఘాల పేరుతో పార్టీ నాయకులు టికెట్లు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదలను పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
మోసగాళ్లకు మోసగాడు - ఒక జ్ఞాపకం
హ్యూమర్ ఫ్లస్ మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చి 45 ఏళ్లయింది. కాలం ఒక పెద్ద మోసగత్తె. అది మనల్ని మాయచేసి అన్నీ లాగేస్తుంది. ముఖ్యంగా మన పసితనాన్ని. ఆ సినిమా చూసినపుడు నా వయసు ఏడేళ్లు. ఇంట్లో తెలియకుండా దొంగగా చూసిన మొదటి సినిమా అది. నా కంటే పెద్దవాళ్ల గ్రూప్ (వాళ్ల వయసు 13) రహస్యంగా ప్లాన్ చేసి మ్యాట్నీకి వెళ్లాలనుకుంది. ప్లాన్ నాకు లీకయ్యింది. నన్ను తీసుకెళ్లకపోతే అందరిళ్లలో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేశాను. చచ్చినట్టు తీసుకెళ్లారు. రాయదుర్గంలో కె.బి. ప్యాలెస్ అనే థియేటర్ వుండేది. (ఇంకా వుంది) బాక్సులు తుప్పుపట్టి, రీళ్లు అనేకసార్లు కటింగైన తరవాత ఈ థియేటర్‌కి సినిమాలు వచ్చేవి. కొత్త సినిమా వచ్చిన రోజు ఒంటెద్దు బండిపై బ్యాండ్ మేళంతో వూరేగించేవారు. మోసగాళ్లకు మోసగాడు ఊరేగింపు చూసి ఆవేశపడి మా సీనియర్స్ థియేటర్‌కి చేరుకున్నారు. వాళ్ల వెంట నేను కూడా పరుగులు తీశాను. బుకింగ్ దగ్గర జనం ఒకరిమీద ఇంకొకరు ఎక్కి తొక్కుకుంటున్నారు. నేల క్లాస్‌కి లిమిట్ ఉండేది కాదు. ఎంతమందినైనా లోనికి తోసేసేవాళ్లు. లోపలున్నవాళ్లు ఒకరిలో ఒకరు ఇరుక్కుని, ఇక స్థలం లేక కుయ్యోమని సోడా కొట్టినట్టు అరిచేవాళ్లు. హాహాకారాలు వినిపించిన తరువాత టికెట్లు ఆపేవాళ్లు. మా దొంగల బ్యాచ్‌కి టికెట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియకపోతే ఒక బ్లాక్ మార్కెట్వాడు వచ్చాడు. నలభై పైసల టికెట్‌ని నలభై ఐదు పైసలకి అమ్మాడు. ఐదు పైసలకి బ్లాక్ టికెట్లు అమ్మే అమాయకుల్ని చూడ్డం అదే మొదలు, ఆఖరు కూడా. గర్వంగా థియేటర్లోనికెళితే బీడీల కంపు, చీకటి. న్యూస్‌రీల్ వేస్తున్నారు. నెహ్రూ ప్రధానిగా వున్నప్పటి న్యూస్‌ని, ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు చూపించేవాళ్లు. ఆరోజుల్లో వార్తలు అంత వేగంగా అందించేవాళ్లు. ఒకరి చెయ్యి ఇంకొకరు పట్టుకుని తడుముకుంటూ అనేకమంది కాళ్లు తొక్కుతూ మనుషుల భుజాలపై వెళ్లాం. నేను వెళ్లి ఎవడి ఒళ్లోనో కూచున్నాను. కుక్క చెవుల్లాగా సాగిపోయిన పాత రీళ్లు కాబట్టి, కాసేపు సరళరేఖలు వక్రరేఖలు తెరపై కనిపించి సినిమా మొదలైంది. కృష్ణ గుర్రంపై రాగానే కేకలు, ఈలలు. బుకింగ్ క్లర్క్ రెండు చేతులతో ఇంకా టికెట్లు ఇస్తున్నందువల్ల నల్లటి పరదా తొలగించుకుని గుంపులు గుంపులుగా జనం వస్తూ ఎవడో ఒకడి మీద కూచుంటున్నారు. కొంతమంది స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూడా కూచున్నారు. ప్రతి నటుడు ఆకాశమంత ఎత్తు కనిపిస్తాడు వాళ్లకి. కృష్ణ వచ్చి గన్ని లోడ్ కూడా చేయకుండా వరసపెట్టి కాలుస్తూ వుంటే ఆనందంతో అక్కడికక్కడే అభిమానయ్యాను. ఆ తరువాత అన్ని సినిమాల్లో కృష్ణ ఒకేరకంగా నటిస్తాడని తెలుసుకుని వీరాభిమానినయ్యాను. అప్పట్లో ఇంటర్వెల్ లేదు. ఎన్నిసార్లు సినిమా కట్ అయితే అన్ని ఇంటర్వెళ్లు. రష్ ఎక్కువుంటే సోడాలు, మురుకులు అయ్యేవాళ్లకి పండగ. ఆ జనంలో సుడిగాలి పర్యటన చేసేవాళ్లు. సోడాలు కుయ్యిమని మోగేవి. మురుకులు రాళ్లకంటే గట్టిగా వుండేవి. థియేటరంతా కటకటమని సౌండొచ్చేది. కృష్ణని చూసిన ఆనందంతో గుర్రంలాగా పరిగెత్తుతూ ఇంటికెళ్లాను. గాడిదని కొట్టినట్టు కొట్టారు. అందరి ఇళ్లలోనూ బడితపూజ జరిగిందని తెలిసింది. మోసగాళ్లకు మోసగాడిని తరువాత నేను చాలాసార్లు చూశాను. ఇది అనేక ఇంగ్లిష్ సినిమాలకి అనుకరణ అని తెలిసిన తరువాత కూడా చూశాను. ఇంకా బాగా నచ్చింది. నిజంగా హాలివుడ్ స్థాయిలోనే వుంటుందిది. సినిమాలో ఆడిపాడి డ్యాన్స్ చేసిన జ్యోతిలక్ష్మి ఈమధ్యే పోయింది. నాగభూషణం ఎపుడో పోయాడు. గుమ్మడి, త్యాగరాజు, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి ఇంకా చాలామంది జీవించిలేరు. కానీ వాళ్ల పాత్రలు ఎప్పటికీ బతికే వుంటాయి. అతి తెలివితో ప్రవర్తించేవాళ్లని చూసినపుడు నాగభూషణం గుర్తుకొస్తాడు. తాగుబోతు వాగుడు వాగే సాక్షి రంగారావు ప్రతి వైన్‌షాపు దగ్గర కనిపిస్తాడు. ఇండియన్ కౌబాయ్ కృష్ణకి ఈరోజు 70 ఏళ్లు దాటొచ్చు. కానీ మాలాంటి అభిమానుల గుండెల్లో ఆయనెప్పుడూ జేమ్స్‌బాండే! - జి.ఆర్. మహర్షి -
బ్లాక్‌లో కబాలి టికెట్లు: నలుగురు అరెస్ట్
శంషాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొనేవారికి థియేటర్ల లో హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గణేష్ థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డు వేసి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. కొనుగోలు చేయాలని ప్రయత్నించిన అభిమానులకు టికెట్ల రేట్లు చూసి దిమ్మతిరిగిపోతోంది. దీంతో అభిమానులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుచి సినిమా టికెట్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
సినిమా చూపిస్త మామ...!
ఒంగోలులోని సినిమా థియేటర్ల వద్ద జోరుగా బ్లాక్ టికెట్ల విక్రయం సినిమాను బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు అదనపు బాదుడు హాలు నిండకపోయినా హౌస్‌ఫుల్ బోర్డులు థియేటర్ ఆవరణలోనే బహిరంగ విక్రయాలు ఏసీలు, మరుగుదొడ్లు, అధ్వానం మామూళ్ల మత్తులో పోలీస్, రెవెన్యూ అధికారులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సినిమా థియేటర్ల వద్ద టికెట్లను మొత్తంగా బ్లాక్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ఒక్క టికెట్ కూడా కౌంటర్లో దొరకదు. కానీ, అక్కడే బహిరంగంగా బ్లాక్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కో టికెట్‌ను రూ.200కు తగ్గకుండా అమ్ముతుంటారు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. ఇక ఆ సినిమా ఆడినన్నాళ్లు రూ.70 నుంచి రూ.120 వరకు ధర ఉన్న టికెట్లను రూ.200కు, రూ.50 ధర ఉన్న టికెట్లను రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రేక్షకులు సినిమా థియేటర్‌కు వచ్చే సమయానికి హౌస్‌ఫుల్ బోర్డు పెట్టి కౌంటర్లలో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అన్ని టికెట్లనూ హాలు బయటే బహిరంగంగా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. అంతేగాకుండా సీట్ల నంబర్‌తో పనిలేకుండా అధికంగా టికెట్లు విక్రయిస్తుండటంతో టికెట్ కొనుక్కుని తీరా థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులు సీట్ల కోసం తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో సినిమా చూడాలనుకునే సామాన్య, మధ్యతరగతి వారు బ్లాక్‌లో టికెట్లు కొనలేక, సీట్ల కోసం గొడవలు పడలేక థియేటర్లకు రావడమే మానేస్తున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం... ప్రతి థియేటర్‌కు బి-ఫారం లెసైన్సులు తప్పనిసరిగా ఉండాలి. గతంలో ప్రతి ఏడాదీ దీనిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నా.. ఇటీవల రెన్యువల్ సమయాన్ని 5 సంవత్సరాలకు పెంచారు. బి.ఫారం లెసైన్సులను జాయింట్ కలెక్టర్ ఇస్తుండగా, రెన్యువల్ చేయించే అధికారం ఆర్డీఓకు ఉంది. అంతకు ముందే ఫైర్ సర్టిఫికెట్, ఆర్అండ్బీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు. ఇక క్యాంటీన్‌కు సంబంధించి శానిటేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫై చేయాలి. కానీ, వీరిలో చాలా మంది అధికారులు థియేటర్ల దగ్గర మామూళ్లు వసూలు చేసి అంతా బాగున్నట్లుగా సర్టిఫై చేస్తున్నారు. ఇటీవల ఒంగోలుకు సంబంధించిన చాలా మంది సినిమా అభిమానులు బ్లాక్ టికెట్ల అమ్మకాలపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా బ్లాక్ టికెట్ల అమ్మకాలపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు పంపిస్తున్నారు. వారు మామూళ్లు తీసుకుని మమ అనిపిస్తున్నారు. అడపాదడపా ఉన్నతాధికారులకు కూడా భారీగానే ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. క్యాంటీన్లో అధిక ధరలు... ఇక థియేటర్లలోని క్యాంటీన్లలోనూ తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌కు అధిక రేట్లు వసులు చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్, చిప్స్ ప్యాకెట్లు, తదితర తినుబండారాలకు రూ.5 నుంచి రూ.10 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. దీనికితోడు పేరుకు ఏసీ థియేటర్లు అని చెబుతున్నప్పటికీ సినిమా ప్రారంభమవగానే ఏసీలు ఆవేస్తున్నారు. థియేటర్లు కూడా ఏమాత్రం పరిశుభ్రంగా ఉండటం లేదు. అసలే తక్కువ సంఖ్యలో ఉండే మరుగుదొడ్లకు తోడు పరిశుభ్రత లోపించి కంపు కొడుతుండటంతో ప్రేక్షకులు ముక్కు మూసుకోక తప్పడం లేదు. కానీ, సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నిబంధనలకు పాతర... సినిమాటోగ్రఫీ యాక్టు జీవో నంబర్ 100 ప్రకారం టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.75, నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.70, లోయర్ క్లాస్ రూ.10 ఉండాలి. ఒంగోలు మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీ రూ.120, సెకండ్ క్లాస్ రూ.80 వంతున విక్రయించాలి. అద్దంకిలో ఫస్ట్ క్లాస్ రూ.70 ఉండగా, రూరల్ ఏరియాల్లో ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.45, నాన్ ఏసీ రూ.40, లోయర్ క్లాస్ రూ.10 చొప్పున విక్రయించాలి. కానీ, అందుకు మూడు రేట్లు ఎక్కువగా టికెట్లను బ్లాకులో అమ్ముతున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మితే కేసులు పెడతామని అధికారులు పేరుకు హెచ్చరిస్తు న్నా.. ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. -
‘సరైనోడు’ బ్లాక్ టికెట్లు: వ్యక్తి అరెస్ట్
కీసర(రంగారెడ్డి): స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పవర్ఫుల్ డెరైక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా శుక్రవారం విడుదలైంది. మొదటి ఆట నుంచే సినిమా చూడాలని అభిమానులు ఎగబడుతుండటంతో.. టిక్కట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించిన కొందరు బ్లాక్ టికెట్ల అమ్మకం మొదలు పెట్టారు. ఒక్కో టికెట్ రూ. 500కు అమ్ముతుండటంతో.. ప్రేక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నాగరాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కొంత నగదుతో పాటు 9 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని కృష్ణా థియేటర్లో శుక్రవారం చోటుచేసుకుంది. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్లాక్ టికెట్లు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శుక్రవారం విడుదలకానున్న క్రమంలో బ్లాక్ టికెట్ల విక్రయం జోరందుకుంది. కుషాయిగూడలోని తుళ్లూరి సినిమా టాకీస్‌పై ఎస్ఓటీ పోలీసులు గురువారం మధ్యాహ్నం ఆకస్మిక దాడి నిర్వహించారు.‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.21 వేల నగదు, ఒక బైక్, 650 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
బ్లాక్ టికెట్స్ టు మాఫియా డాన్..!
* చోటా రాజన్ నేర ప్రస్థానం * మొదట దావూద్‌కు కుడిభుజం.. * అనంతరం ప్రధాన శత్రువు * రెండు దాడుల నుంచి సాహసోపేతంగా తప్పించుకున్న వైనం * దావూద్ సమాచారమందిస్తూ * భారతీయ నిఘా సంస్థలకు సహకారం! సాక్షి, సెంట్రల్ డెస్క్: చోటా రాజన్.. భారత దేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో చెరిగిపోని పేరు. ఎన్నో సినిమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడి సరుకును అందించిన జీవితం. ముంబై శివార్లలోని చెంబూర్ ప్రాంతంలో సహకార్ సినిమాటాకీస్ వద్ద బ్లాక్ టికెట్ల అమ్మకంతో ప్రారంభమైన ఆ 'నానా' నేర జీవితం క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్ట్‌లతో.. మతం, దేశభక్తి కోణాలతో ఆసక్తికర మలుపులతో సాగుతుంది. 1959లో జన్మించిన రాజేంద్ర సదాశివ నికాల్జే సాధారణ మిల్లు కార్మికుడి కొడుకు. చెంబూర్ ప్రాంతంలో బ్లాక్ టికెట్లమ్ముతూ, చోటామోటా నేరాలు చేస్తూ గడుపుతుండేవాడు. స్థానిక దాదా రాజన్ నాయర్ ఉరఫ్ బడా రాజన్ ప్రాపకంలో మరింత రాటు తేలాడు. బడా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా అక్రమ మద్యం, బంగారం, వెండి స్మగ్లింగ్, బెదిరింపు వసూళ్ల దందా, భూ సెటిల్మెంట్లు తదితరాలతో ముంబై నేర సామ్రాజ్యంలో వేళ్లూనుకున్నాడు. తమిళ డాన్ వరదరాజ ముదలియార్, హైదరాబాదీ గ్యాంగ్‌స్టర్ యాదగిరిలతో సంబంధాలు పెంచుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నాడు. 1983లో బడారాజన్ హత్య అనంతరం ఆ గ్యాంగ్ పగ్గాలు చేపట్టి 'చోటా రాజన్'గా అలియాస్ 'నానా'గా మారాడు. అదే క్రమంలో ముంబైలో అప్పటికే చక్రం తిప్పుతున్న గ్యాంగ్స్టర్లు అరుణ్ గావ్లి, దావూద్ ఇబ్రహీంలతో కలిసి క్రిమినల్ యాక్టివిటీస్‌ను తీవ్రం చేశాడు. ముంబై అక్రమ ఆయుధాల వ్యాపారంలో కీలకంగా మారాడు. అదే క్రమంలో దావూద్ ఇబ్రహీంకు బాగా దగ్గరయ్యాడు. అత్యంత సన్నిహితుడిగా పేరొందాడు. దావూద్‌కు నడిపే డీ కంపెనీలో కీలకంగా మారాడు. 1980ల నాటికి దావూద్‌కు కుడిభుజంగా, ఆయన నేర కార్యకలాపాల్లో, ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్‌లో కీలక శక్తిగా రూపొందాడు. పోలీసుల వేట తీవ్రం కావడంతో అరెస్ట్‌ను తప్పించుకునేందుకు దావూద్ దుబాయి పారిపోయిన సమయంలో డీ కంపెనీ ముంబై కార్యకలాపాలను తానే చేపట్టాడు. స్మగ్లింగ్ వ్యవహారాలను శ్రీలంక, నేపాల్‌ల వరకు విస్తృతం చేశాడు. 1989లో దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగిన దావూద్ సోదరుడి వివాహానికి హాజరై... ముంబై పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అక్కడే ఉండిపోయాడు. దేశభక్త డాన్‌గా చిత్రీకరణ..: ముంబై పేలుళ్లను వ్యతిరేకించి, దేశభక్త డాన్‌గా రాజన్ తనను తాను చిత్రీకరించుకున్నాడు. ఇండియాలో దావూద్‌ను జాతివ్యతిరేకి, దేశద్రోహిగా చిత్రీకరించడంలో విజయం సాధించాడు. ఈ క్రమంలో శివసేనకు, ఠాక్రేలకు సన్నిహితుడయ్యాడని కూడా అంటుంటారు. మరోవైపు, దావూద్‌కు సంబంధించిన కీలక సమాచారం, దావూద్ నేర వ్యవహరాల వివరాలు అందిస్తూ భారత దర్యాప్తు, నిఘా సంస్థలకు కూడా దగ్గరయ్యాడని సమాచారం. దావూద్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా రాజన్‌కు ఇతోధికంగా సాయపడి అతని ఎదుగుదలకు దోహదపడ్డారు. మరోవైపు, నకిలీ నోట్లు, క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌లు, బాలీవుడ్ ఫైనాన్సింగ్ వ్యవహారాల్తో ఆర్థికంగా బలపడ్డాడు. బాలీవుడ్ తారలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. ఎటాక్స్..: ముంబైలో సొంత అస్తిత్వం దెబ్బతింటున్న పరిస్థితులు ఏర్పడటంతో రాజన్ అడ్డు తొలగించుకోవడం దావూద్‌కు అనివార్యమైంది. తన సన్నిహిత సహచరుడు చోటా షకీల్‌కు ఆ బాధ్యత అప్పజెప్పాడు. దాంతో తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో రాజన్ ముంబై కన్నా బ్యాంకాక్ సురక్షితమని భావిం చి, అక్కడికి స్థావరాన్ని మార్చుకున్నాడు. రాజన్ 2000 సంవత్సరంలో రాజన్‌పై మొదటిసారి భారీ ఎటాక్ జరిగింది. బ్యాంకాక్‌లోని రాజన్ స్థావరంలోకి పిజ్జా డెలివరీ బోయ్స్ రూపంలో చోటా షకీల్, మరి కొందరు చొరబడి, రాజన్‌పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రోహిత్‌వర్మ షార్ప్ షూటర్, రాజన్ సన్నిహితుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఇంటి పై కప్పు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు చోటా రాజన్. ఆకస్మిక దాడి నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని.. అనంతరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. థాయ్ పోలీసుల అరెస్ట్‌ను తప్పించుకునేందుకు హాస్పిటల్ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. 2003లో ఆ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాడు. బ్యాంకాక్ దాడిలో పాల్గొన్న దావూద్ కీలక అనుచరుడు శరద్ షెట్టీని రాజన్ గ్యాంగ్ దుబాయిలో హతమార్చింది. మరో ఇద్దరు దావూద్ అనుచరులు వినోద్ షెట్టీ, సునీల్ సోవన్లను కూడా చంపేశారు. కొన్నాళ్ల తరువాత ఆస్ట్రేలియాలో మారుపేరుతో తలదాచున్నాడు. 2015 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోనూ రాజన్‌పై దాడి చేసేందుకు చోటా షకీల్ వ్యూహం రచించాడు. చోటా రాజన్ అనుచరుడిని తమవైపు తిప్పుకుని, పూర్తి వివరాలు రాబట్టాడు. కానీ, ఈ విషయం ముందే తెలవడంతో, రాజన్ ఆ ప్రాంతం నుంచి సురక్షిత, రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. తాజాగా విహారయాత్ర కోసం ఇండోనేసియాలోని బాలి ద్వీపానికి వెళ్లిన చోటా రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసుల సహకారంతో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజన్ క్రైమ్ స్టోరీ క్లైమాక్స్‌కు వచ్చింది. ఇటీవల రాజన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, కిడ్నీలు పనిచేయడంలేదని, నిత్యం డయాలసిస్ తప్పట్లేదన్న వార్తలు వచ్చాయి. దాంతో కావాలనే అరెస్ట్ అయ్యాడన్న వాదనా వినిపిస్తోంది. 1993 ముంబై పేలుళ్లు.. 1992లో దావూద్ ఆదేశాల మేరకు రాజన్ అనుచరులు ముగ్గురిని దావూద్ సన్నిహితుడు సుభాష్ ఠాకూర్ హతమార్చడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. అయితే 257 మందిని బలిగొన్న ముంబై వరుస పేలుళ్లను రాజన్ తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఆ సీరియల్ పేలుళ్లను రాజన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తద్వారా హిందువుల అనుకూల డాన్‌గా ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత దావూద్‌ను, దుబాయిని వీడివచ్చేశాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. సొంత గ్యాంగ్ సహకారంతో ముంబైలో దావూద్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. 1993 నుంచి 2000 దాకా ఆ ఇద్దరి గ్యాంగ్‌వార్‌లో ఇరువర్గాలకు చెందిన వందమందికి పైగా హతమయ్యారు. -
బ్లాక్ టికెట్ల విక్రేతలు అరెస్టు
విజయవాడ సిటీ : శ్రీమంతుడు సినిమా విడుదలను పురస్కరించుకొని గవర్నరుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సినిమా థియేటర్ల వద్ద టికెట్లను బ్లాకులో విక్రయిస్తున్న 13మందిని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నగదు, సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. సినిమా టికెట్లను భారీగా బ్లాకులో విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పలు థియేటర్ల వద్ద ఏసీపీ పి.మురళీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా13 మంది పట్టుబడ్డారు. వారి వద్ద రూ.17,340 నగదు, 63 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వారిని గవర్నరుపేట పోలీసులకు అప్పగిం చారు. ఎస్ఐ సురేష్‌రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు. సత్యనారాయణపురంలో.. సత్యనారాయణపురం : శ్రీమంతుడు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని సత్యనారాయణ పురం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద రూ.9వేలు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ థియేటర్ల వద్ద వారిని పట్టుకున్నా మని సీఐ సత్యనారాయణ తెలిపారు. -
బ్లాక్ లో 'శ్రీమంతుడు' సినిమా టికెట్లు
విశాఖపట్టణం: మహేశ్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమా టికెట్లును బ్లాక్ లో విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అభయ బ్రాడ్ బాండ్ కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసి బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని అడ్డుకున్నారు. 800 టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 200 టిక్కెట్ ను రూ.1000 అమ్ముతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. సినిమా టిక్కెట్లు బ్లాక్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 'శ్రీమంతుడు' సినిమా శుక్రవారం విడుదలకానుంది. -
ఆ ఆరోపణలు అవాస్తవం: గంటా కార్యాలయ వర్గాలు
విశాఖ : బాహుబలి సినిమా బ్లాక్ టికెట్లపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయ వర్గాలు స్పందించాయి. బ్లాక్ టికెట్లపై ప్రేక్షకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించాయి. కాగా విశాఖ జిల్లావ్యాప్తంగా బ్లాక్ టికెట్ల విక్రయాలు జరిగాయి. రూ.25 టికెట్లను రూ.1000, రూ.50 టికెట్లను 2వేల నుంచి 4000 వేల వరకూ విక్రయించారు. మంత్రి గంటా కార్యాలయం వద్ద బాహుబలి టికెట్లను రూ.500లకు విక్రయించారని అభిమానులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. -
అల్లుడే..బాహుబలుడు
గంపగుత్తుగా బాహుబలి టిక్కెట్ల బ్లాక్ థియేటర్లను గుప్పిటపట్టిన కీలక నేత అల్లుడు ఒక్కో టిక్కెట్టు రూ.500 నుంచి రూ.4వేలు జిల్లాలో భారీ దోపిడీచోద్యం చూస్తున్న యంత్రాంగం విశాఖపట్నం : ‘బాహుబలి’ భారతీయ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా... భారీ తారాగణం...ప్రేక్షకుల్లో భారీ క్రేజ్... విజయంపై భారీ అంచనాలు... అంతేనా!... అన్నీ భారీగా ఉన్నప్పుడు తమ దోపిడీ కూడా భారీగానే ఉండాలి అని భావించారు ప్రభుత్వ పెద్ద సమీప బంధువు. జీవీఎంసీ పరిధి వరకు సర్వం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్ద సమీప బంధువు తక్షణం రంగంలోకి దిగారు. ప్రేక్షకుల క్రేజ్‌ను సొమ్ముచేసుకునేందుకు అధికార బలాన్ని మొత్తం ఉపయోగించారు. జిల్లావ్యాప్తంగా అత్యధిక థియేటర్లను వ్యూహాత్మకంగా గుప్పిట పట్టారు. టిక్కెట్టుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తు ఉండిపోయింది. అంతా అయిపోయాక ఆన్లైన్లోనే టిక్కెట్ల విక్రయాలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ వైనం ఇదిగో ఇలా ఉంది... జీవీఎంసీ పరిధిలో సర్వం తానై వ్యవహరించే ప్రభుత్వంలో కీలక నేతకు అల్లుడు. ఇంకేముందీ!... జిల్లాకే అల్లుడన్నట్లు వ్యవహరించారు. బాహుబలి సినిమా క్రేజ్‌ను సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలో దాదాపు 48 థియేటర్లలో ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. అల్లుడుగారు వ్యూహాత్మకంగా అత్యధిక థియేటర్ల యజమానులతో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధానంగా క్లాస్ టిక్కెట్లు తమ ఆధీనంలో ఉంచుకున్నా రు. అనంతరం టిక్కెట్ల ధరలను భారీ గా పెంచేసి బ్లాక్‌లో విచ్చలవిడిగా విక్రయం చేపట్టారు. థియేటర్‌ను బట్టి ఒక్కో టిక్కెట్టు ధర రూ.500 నుంచి రూ.4వేల వరకు నిర్ణయించారు. కనీసం 5టిక్కెట్లు కొంటే ఒక ధర... టోకుగా 50 నుంచి 100 టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఒక ధర ఇలా నిర్ణయించారు. జిల్లాలో 48 థియేటర్లలో అత్యధిక థియేటర్లు వారంరోజులపాటు ఆ అల్లుడి గుప్పిట ఉండటం గమనార్హం. ఆ లెక్కన తొలివారం బ్లాక్ టిక్కెట్ల విక్రయం ద్వారా కోట్లలో అవినీతి దందా సాగనుందని స్పష్టమవుతోంది. చేష్టలుడిగిన అధికార యంత్రాంగం సగటు జీవికి ఏకైక వినోదాత్మక అంశమైన సినిమా క్రేజ్‌ను ఇలా అడ్డగోలుగా సొమ్ముచేసుకుంటున్నా అధికార యంత్రాంగం మిన్నుకుండిపోయింది. మూడురోజులుగా ఇంత జరుగుతున్నా కనీసం స్పందించలేదు. అంతా అయిపోయాక... థియేటర్ల మీద ఒకట్రెండు చోట్ల రాళ్లు రువ్విన తరువాత జిల్లా అధికారులు గురువారం రంగంలోకి దిగారు. థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. రూ.50కు మించిన టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ఆదేశించారు. 24గంటల ముందు అధికారులు జారీ చేసిన ఆదేశాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అప్పటికే టిక్కెట్లు థియేటర్ల యజమానుల చేతుల్లోని అల్లుడిగారి సిండికేట్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అధికారులు చెప్పిన ఆన్లైన్లో టిక్కెట్లు పొందడం ప్రేక్షకులకు దుర్లభంగా మారింది. -
'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం
చైతన్యపురి (హైదరాబాద్) : బాహుబలి సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని రెండు థియేటర్లపై దాడి చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై దాడి చేసి మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
అ‘ధన’పుదోపిడీ
ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లలో ఉత్సాహం ఆశించిన స్థాయిలో ‘క్రిస్మస్’ వ్యాపారం కొత్త సంవత్సరం, సంక్రాంతిపైనే దృష్టి టికెట్లు బ్లాక్ చేసి రెట్టింపు ధరకు విక్రయించే యోచన పట్టించుకోని రవాణాశాఖ అధికారులు మర్రిపాలెం : ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. క్రిస్మస్ పండగలో వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగడంతో కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగపై దృష్టిసారించారు. ఆ సీజన్లో కోట్ల రూపాయల అమ్మకాలకు కసరత్తు ప్రారంభించారు. రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో అడ్డగోలుగా దోచుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ఆపేశారు. పండగ రోజుల్లో అవకాశాన్ని బట్టి సొమ్ము రాబట్టుకోవాలని వేచి చూస్తున్నారు. ఆన్లైన్, ట్రావెల్స్ కార్యాలయాల్లో టికెట్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. కొ త్త సంవత్సరానికి 50 శాతం చార్జీలు అధికం చేసి అమ్మకాలు చేస్తున్నారు. జనవరి 12 నుంచి 17 తేదీల్లో టికెట్లు అందుబాటులో ఉంచకపోవ డం విశేషం. పండగ రోజుల్లో రెట్టింపు వసూళ్లకు పాల్పడేందుకు ట్రావెల్స్ యాజమాన్యాల ఎత్తుగడ. కన్నెత్తి చూడలేని పరిస్థితి.. గతేడాది పండగ సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు గడ్డుకాలం ఎదుర్కొన్నారు. రోడ్డెక్కడానికి భయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దుర్ఘటనతో ఆపరేటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ప్రైవేట్ బస్సులపై దాడులు జరగడం లేదు. ఆరు నెలలుగా ఒక్క బస్సును కూడా అధికారులు సీజ్ చేయలేదు. రాష్ట్రంలో ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన ఆపరేటర్లు ఇద్దరు ఎంపీలుగా ఉండటంతో కన్నెత్తి చూడలేని దుస్థితిలో ఉంటున్నారు. ఇది మా ప్రభుత్వం! రోజులు మావి! అన్నట్టుగా ఆపరేటర్లు వ్యవహరించడం రవాణా అధికారులకు మింగుడుపడటం లేదు. మా బస్సుల్సి ఆపే దమ్ము ఎవరికి ఉంది! అనే రీతిలో వ్యాపారులు హవా చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఆపరేటర్ల ఇష్టారాజ్యం! కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిట్‌తో స్టేజి క్యారియర్‌గా రాకపోకలు చేస్తున్నా అడిగే నాథుడు లేకపోవడంతో ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు బహిరంగంగా ప్రయాణిస్తున్నా రవాణా అధికారులు నోరు మెదపడం లేదు. కళ్ల ముందు రాకపోకలు చేస్తున్నా కనీసం తనిఖీలు జరపడం లేదు. అడపా దడపా తనిఖీలు జరిపినా పై స్థాయి నుంచి సిఫార్సులు రావడం, కొన్ని సందర్భాలలో చీవాట్లు పెట్టడంతో మాకెందుకులే! అన్న రీతిలో ఉంటున్నారు. నిబంధనల పేరుతో దాడులకు దిగితే తమ పోస్టింగ్‌లకు ముప్పు తప్పదన్న ఆలోచనలతో అధికారులు నడుచుకుంటున్నారు. ఈసారి ఎలాగూ దాడులకు అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు దండిగా దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు.