సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (హెచ్‌సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్‌పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
హెచ్‌సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment