భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్‌లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది.
పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్‌రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్‌సన్..
ఇలా ఎందరో టాప్‌మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్
స్టేడియంలో భారత ఆటగాళ్లు
సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి.
ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు.
మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్‌తో వన్డే సిరీస్‌లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్‌కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది.
పిచ్‌ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్
ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా..
►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24
ఎక్కడ: ఎల్బీ స్టేడియం
ఫార్మాట్: టెస్ట్
తుది ఫలితం: ‘డ్రా’
సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్‌క్లిఫ్ 137 నాటౌట్).
► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20
ఎక్కడ: ఎల్బీ స్టేడియం
ఫార్మాట్: టెస్ట్
తుది ఫలితం: ‘డ్రా’
సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268).
►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6
ఎక్కడ: ఎల్బీ స్టేడియం
ఫార్మాట్: టెస్ట్
తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం
సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్‌గ్రేట్‌బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21).
న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్
►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16
ఎక్కడ: ఉప్పల్ స్టేడియం
ఫార్మాట్: టెస్ట్
తుది ఫలితం: ‘డ్రా’
సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327).
►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26
ఎక్కడ: ఉప్పల్ స్టేడియం
ఫార్మాట్: టెస్ట్
తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం
సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48).
మరుపురాని వన్డే మ్యాచ్
ఎప్పుడు: 1999, నవంబర్ 8
ఎక్కడ: ఎల్బీ స్టేడియం
ఫార్మాట్: వన్డే
తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం
సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39).
సచిన్, సెహ్వాగ్‌ల వీర విహారం
ఎప్పుడు: 2003, నవంబర్ 15
ఎక్కడ: ఎల్బీ స్టేడియం
ఫార్మాట్: వన్డే
తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం
సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38).
ఉప్పల్‌లో భారత్ ఇలా..
2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 13 మ్యాచ్‌లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్‌ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది.
Comments
Please login to add a commentAdd a comment