అల్లుడే..బాహుబలుడు | bahubali movie black ticket dandha | Sakshi
Sakshi News home page

అల్లుడే..బాహుబలుడు

Published Fri, Jul 10 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

అల్లుడే..బాహుబలుడు

అల్లుడే..బాహుబలుడు

గంపగుత్తుగా బాహుబలి టిక్కెట్ల బ్లాక్
థియేటర్లను గుప్పిటపట్టిన కీలక నేత అల్లుడు
ఒక్కో టిక్కెట్టు రూ.500 నుంచి రూ.4వేలు
జిల్లాలో భారీ దోపిడీచోద్యం చూస్తున్న యంత్రాంగం

 
విశాఖపట్నం : ‘బాహుబలి’ భారతీయ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా... భారీ తారాగణం...ప్రేక్షకుల్లో భారీ క్రేజ్... విజయంపై భారీ అంచనాలు... అంతేనా!... అన్నీ భారీగా ఉన్నప్పుడు తమ దోపిడీ కూడా భారీగానే ఉండాలి అని భావించారు ప్రభుత్వ పెద్ద సమీప బంధువు. జీవీఎంసీ పరిధి వరకు సర్వం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్ద సమీప బంధువు తక్షణం రంగంలోకి దిగారు. ప్రేక్షకుల క్రేజ్‌ను సొమ్ముచేసుకునేందుకు అధికార బలాన్ని మొత్తం ఉపయోగించారు. జిల్లావ్యాప్తంగా అత్యధిక థియేటర్లను  వ్యూహాత్మకంగా గుప్పిట పట్టారు. టిక్కెట్టుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తు ఉండిపోయింది. అంతా అయిపోయాక ఆన్‌లైన్లోనే టిక్కెట్ల విక్రయాలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

ఆ వైనం ఇదిగో ఇలా ఉంది...
జీవీఎంసీ పరిధిలో సర్వం తానై వ్యవహరించే ప్రభుత్వంలో కీలక నేతకు అల్లుడు. ఇంకేముందీ!... జిల్లాకే అల్లుడన్నట్లు వ్యవహరించారు. బాహుబలి సినిమా క్రేజ్‌ను సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలో దాదాపు 48 థియేటర్లలో ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. అల్లుడుగారు  వ్యూహాత్మకంగా అత్యధిక థియేటర్ల యజమానులతో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధానంగా క్లాస్ టిక్కెట్లు తమ ఆధీనంలో ఉంచుకున్నా రు. అనంతరం టిక్కెట్ల ధరలను భారీ గా పెంచేసి  బ్లాక్‌లో విచ్చలవిడిగా విక్రయం చేపట్టారు. థియేటర్‌ను బట్టి ఒక్కో టిక్కెట్టు ధర రూ.500 నుంచి రూ.4వేల వరకు నిర్ణయించారు. కనీసం 5టిక్కెట్లు కొంటే ఒక ధర... టోకుగా 50 నుంచి 100 టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఒక ధర ఇలా నిర్ణయించారు. జిల్లాలో 48 థియేటర్లలో అత్యధిక థియేటర్లు వారంరోజులపాటు  ఆ అల్లుడి గుప్పిట ఉండటం గమనార్హం. ఆ లెక్కన తొలివారం బ్లాక్ టిక్కెట్ల విక్రయం ద్వారా కోట్లలో అవినీతి దందా సాగనుందని స్పష్టమవుతోంది.

చేష్టలుడిగిన అధికార యంత్రాంగం
సగటు జీవికి ఏకైక వినోదాత్మక అంశమైన సినిమా క్రేజ్‌ను ఇలా అడ్డగోలుగా సొమ్ముచేసుకుంటున్నా అధికార యంత్రాంగం మిన్నుకుండిపోయింది. మూడురోజులుగా ఇంత జరుగుతున్నా కనీసం స్పందించలేదు. అంతా అయిపోయాక... థియేటర్ల మీద ఒకట్రెండు చోట్ల రాళ్లు రువ్విన తరువాత జిల్లా అధికారులు గురువారం రంగంలోకి దిగారు. థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. రూ.50కు మించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ఆదేశించారు. 24గంటల ముందు అధికారులు జారీ చేసిన ఆదేశాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అప్పటికే టిక్కెట్లు థియేటర్ల యజమానుల చేతుల్లోని అల్లుడిగారి సిండికేట్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అధికారులు చెప్పిన ఆన్‌లైన్లో టిక్కెట్లు పొందడం ప్రేక్షకులకు దుర్లభంగా మారింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement