సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తుది సమరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను వీక్షించాలని భావించిన వేలాది మంది నగరవాసులకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదనే తెలుస్తోంది.
అయితే మరోవైపు కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ మ్యాచ్ టికెట్లను ముందుగానే బ్లాక్ చేశారు. స్టేడియం చుట్టు నంబర్ ప్లేట్‌లు లేని బైక్‌లపై చక్కర్లు కొడుతు జోరుగా బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను ఐదు వేలకు, రెండు వేల టికెట్‌ను పదివేలకు అమ్ముతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తెలస్తోంది. టికెట్లు బ్లాక్‌లో దర్శనమివ్వడంతో మ్యాచ్ నిర్వాహకుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో లభించాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లడంపై నగరంలోని కిక్రెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment