సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment