
లఖనాపురంలో దర్యాప్తును నిర్వహిస్తున్న íసీఐ దాశరధి బ్లేడ్‌లతో చేసిన గాయాలను చూపిస్తున్న యువకులు
విజయనగరం, గరుగుబిల్లి: మండలంలోని లఖనాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులపై బ్లేడ్‌లతో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకొంది. ఈ దాడిలో లఖనాపురం గ్రామానికి చెందిన ముదిలి దినేష్‌కుమార్, శివ్వాల సంతోష్‌కుమార్, సొడవరపు వెంకటరమణ, ఎస్.సురేష్‌కు గాయాలయ్యాయి. మంగళవారం ఈ విషయం తెలుసుకొన్న పార్వతీపురం సీఐ దాశరధి, ఎస్‌ఐ వై.సింహచలంతో పాటు సిబ్బంది లఖనాపురం, పెదబుడ్డిడిలో సంఘటనపై దర్యాప్తు చేశారు. స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడికి చెందిన అఖిల్, సురేష్, సంతోష్‌లు లఖనాపురం యువకులపై బ్లేడ్‌లతో దాడికి పాల్పడి వీపు భాగంలో, మెడ మీద, కాళ్లపై తీవ్ర గాయాలు చేశారు. యువకులు పార్వతీపురంలోని ఓ కళాశాలతో పాటు జ్యోతి ఐటీఐలో విద్యనభ్యసిస్తున్నారు. లఖనాపురానికి చెందిన ఓ యువతి ఫొటో అఖిల్ సెల్‌ఫోన్‌లో ఉండటంతో, అమ్మాయి ఫొటో ఎందుకు ఉంచావని ముదిలి దినేష్, అఖిల్‌ను ప్రశ్నించాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ విషయాన్ని జ్యోతి ఐటీఐ ప్రిన్సిపాల్ దృష్టికి లఖనాపురం గ్రామానికి చెందిన యువకులు తీసుకెళ్లారు. అయితే సోమవారం సాయంత్రం పార్వతీపురం–పెదబుడ్డిడి బస్సులో లఖనాపురం వెళ్తున్న సమయంలో లఖనాపురం బస్టాండ్‌లో అనూహ్యంగా పెదబుడ్డిడి యువకులు మెరుపుదాడికి దిగారు. బ్లేడ్‌తో గాయాలు చేశారని పోలీసులు తెలిపారు. గాయాల పాలైన దినేష్‌కుమార్, సురేష్, వెంకటరమణలను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారని తెలిపారు. తీవ్రంగా గాయాలైన సంతోష్‌కుమార్‌ను రావివలస ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన వైద్యాన్ని అందించారన్నారు. దాడికి పాల్పడిన సురేష్ అదుపులో వుండగా అఖిల్, సంతోష్‌లు పరారయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత క్షణికావేశానికి గురై నేరాలకు పాల్పడరాదన్నారు. విచారణలో సిబ్బంది పి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment