
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజధాని కాబూల్‌లోని ఓ షియా సాంస్కృతిక కళా వేదిక వద్ద పలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొని దాదాపు 40 మంది మృత్యువాతపడ్డారు. 30మందికి పైగా గాయాలపాలయ్యారు. చాలా రోజుల తర్వాత అత్యంత దారుణమైన హింసాత్మక ఘటన ఇదే. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా బలగాలు మాత్రం తాలిబన్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాబూల్ అంతర్గత భద్రతా వ్యవహారాల అధికార ప్రతినిధి నస్రాత్ రహిమి మీడియాతో మాట్లాడుతూ షియా సాంస్కృతిక కళా సెంటర్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అన్నారు. అఫ్ఘనిస్థాన్‌లో సోవియెట్ దురాక్రమణకు 38 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ ఓ కార్యక్రమం జరుగుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ‘40మంది చనిపోయినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మరో 30 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే మొత్తం ప్రాణ నష్టంగా చెప్పలేము.. ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment