
సూర్యాపేట : సుర్యాపేట జిల్లాలోని ఓ తండాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కొందరు దుండగులు తండాలోని ప్రతి ఇంటిపై రక్తాన్ని చల్లారు. అందరి ఇంటి ముందు రక్తపు మరకలు కనిపించడంతో తండాలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం రోళ్ల బండ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తండాలోకి చొరబడి శ్రీరాంసాగర్ కాల్వ దగ్గర నుండి గ్రామపంచాయతీ చివరి వరకు గ్రామంలోని ప్రతి ఇంటిపైన రక్తాన్ని చల్లారు. మెట్లు ఉన్న ఇళ్లపైకి వెళ్లి డాబాపైన కూడా రక్తం చల్లారు. సోమవారం ఉదయం దీన్ని గమనించిన తండావాసులు ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తండాకు ఎవరు వచ్చారు ..? రక్తం ఎక్కడిది ? ప్రతి ఇంట్లో రక్తం చల్లింది ఎవరు? ఎందుకు చల్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment