విద్యార్థులు వేడుక జరుపుకున్న గెస్ట్‌హౌస్ ఇదే..
బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు సాయి చైతన్యారెడ్డి, మేరెడ్డి స్ఫూరిరెడ్డి, ప్రణీతలు మృతిచెందగా తీవ్రంగా గాయపడిన వినిత్‌రెడ్డి (22)ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. మరో విద్యార్థి మనీష్‌రెడ్డి రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..ప్రమాదానికి మైసిరెడ్డిపల్లి శివారులోని ప్రమాదకరంగా ఉన్న మూలమలుపే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
(చదవండి : కన్నవారికి...కడుపు కోత)
ఇబ్రహీంపట్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాక మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని బృందావన్ గెస్ట్‌హౌస్‌లో ఫేర్‌వెల్ చేసుకున్నారు. వేడుకలో 16 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. మధ్యాహ్నం ప్రారంభమైన పార్టీ రాత్రి పది గంటల వరకు కొనసాగినట్లు సమాచారం. పార్టీ జరుగుతున్న క్రమంలోనే ఐదుగురు విద్యార్థులు మండల కేంద్రం నుంచి బీబీనగర్ వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో ఎదురుగా పోలీస్ వాహనం ఎదురైంది. దానిని కట్ కొట్టి కారును వేగంగా ముందుకు నడిపారు. పోలీసులు గమనించి రాత్రివేళ ఇంత వేగంతో కారు వెళ్లడమేంటని తిరిగి వారు తమ వాహనంలో కారును ఫాలోఅయ్యారు. కొద్దిదూరం వెళ్లగానే విద్యార్థుల కారు ఫల్టీకొట్టి కనిపించింది. అయితే కారు నడుపుతున్న విద్యార్థికి మైసిరెడ్డిపల్లి శివారులో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని ప్రమాదకర మూలమలుపుపై అవగాహన లేకపోవడం.. అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఘటనాస్థలిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా..
మండలంలో పలు ఫాం హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొమ్మలరామారం మండలం రాజధానికి అతి మీపంలో ఉండడంతో కొందరు యువత వీకెండ్ పార్టీలకు ఇతర జల్సాలకు మండలంలోని పలు ప్రాంతాల్లో గల ఫాం హౌస్‌లను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు ఫాంహౌŠలు నిర్వహిస్తూ యువతను ఆకర్షించేందుకు విఫలయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిషేధిత మాధకద్రవ్యాలతో పాటు హూక్కా, మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం.
‘బృందావన్‌పూర్’లో అన్నీ..
మంగళవారం శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు వేడుక జరుపుకున్న బృందావన్ ఫాంహౌస్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. అయితే గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకుంటే కస్టమర్ల అవసరం మేరకు మద్యంతో పాటు డ్రగ్స్‌ను అందజేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ గెస్ట్ హౌస్‌లో ప్రతి వీకెండ్‌లతో పాటు రాత్రి సమయాల్లో యువకుల కేరింతలు, హోరెత్తే లౌడ్ స్పీకర్ల సౌండ్‌లతో ఇబ్బందులు పడుతున్నామని పరిసరాల ప్రజలు వాపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు గంజాయి,కొకైన్ లాంటి డ్రగ్స్‌కు మండలానికి చెందిన కొంత మంది యువకులు బానిసలుగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఇలాంటి ఘనటలు ఆందోళన కల్గిస్తున్నాయి. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండల ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
(చదవండి : అతివేగమే నలుగురిని బలి తీసుకుంది..!)
కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత
భువనగిరిఅర్బన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలకు బుధవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఏరియా ఆస్పత్రి మిన్నంటిపోయింది.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మృతుల కుటుంబాలను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరామర్శించారు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
నరేందర్‌రెడ్డిని ఓదారుస్తున్న రాజగోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment