ఆ పేదింటి చిరుదీపం ఆరిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో చివరకు తీరని శోకమే మిగిలింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తల్లిదండ్రుల కళ్లముందే ఆడుకున్న ఇద్దరు పిల్లల్లో సాయంత్రానికి ఒకరు విగతజీవిగా మారడం.. మరో చిన్నారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ధన్‌సింగ్‌తండాలో ఆదివారం చోటు చేసుకుంది.
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్): తిరుమలగిరి మండలం ధన్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీకి చెందిన మెగావత్ నాగు, సుశీల దంపతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు మెగావత్ హరిలాల్(5), మెగావత్ సాయి, కూతురు సంతానం. హరిలాల్, సాయితో పాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మెగావత్ సైదా కలిసి గ్రామంలోని పాఠశాల వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. స్కూల్ పక్కనే వాగు ప్రవహిస్తుండటంతో అందులో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వాగు మధ్యలో గుంతలు ఉండటంతో నీటిలో ఆడుకుంటూ వెళ్లిన సాయి, హరిలాల్ మునిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన మెగావత్ సైదా గ్రామంలోకి వెళ్లి వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులకు తెలిపాడు. వారు వచ్చి వాగులో గాలించగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో హరిలాల్ మృతిచెందాడు. మరో బాలుడు సాయి పరిస్థితి విషమంగా మారడంతో మొదటగా మిర్యాలగూడ, అక్కడినుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెసింది.
సొమ్మసిల్లిన తల్లిదండ్రులు
అప్పటివరకు తమ కళ్ల ముందే ఆటలాడుకున్న ఇద్దరు కుమారుల్లో ఒకరు మృత్యుఒడికి చేరగా.. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలు బాదుకుని రోదిస్తూ సోమ్మసిల్లి పడిపోయారు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఈ విషయం తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
వాగుకు రిటర్నింగ్ వాల్ కట్టి ఉంటే..
ఊరు మధ్య నుంచే ప్రవహిస్తున్న ఇదే వాగులో గతంలో అదే గ్రామానికి చెందిన చిన్నారులు ఇద్దరు మృతిచెందారు. ఈ గ్రామ పంచాయతీని స్థానిక జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ దత్తత తీసుకుని వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రిటర్నింగ్ వాల్‌తో పాటు, వంతెన నిర్మాణానికి రూ.2.70 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అధికారులు పంపిన నివేదికకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాగుకు రిటర్నింగ్ వాల్, వంతెన నిర్మించి ఉంటే ఇలాంటి విషాదకర సంఘటన జరిగి ఉండేది కాదని తండావాసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment