కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లి రాజేశ్వరి (ఇన్‌సెట్‌లో) కార్తికేయ మృతదేహం
అనంతపురం, గుత్తి: ‘రోజూ నిన్ను చూసి మురిసిపోయేదాన్ని. నీ ముఖం చూశాకే పనుల మీద ధ్యాస పెట్టేదాన్ని. నీ భవిష్యత్ కోసం రోజూ దేవున్ని పూజించేదాన్ని. ఉన్నపళంగా మమ్ములను విడిచి పరలోకాలకు వెళ్లిపోయావు. ఇక నేను ఎలా బతకాలి కొడకా’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడిపై పడి ఆ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. వివరాల్లోకెళ్తే.. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో చాకలి రాము, రాజేశ్వరి (రాజీ) దంపతులు నివాసముంటున్నారు.
వీరికి కార్తికేయ అనే నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం వాటర్ క్యాన్‌ల లోడుతో ఉన్న ఆటో రివర్స్ చేసుకుంటోంది. అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న కార్తికేయ ఆటోకింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కార్తికేయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విగతజీవి అయిన కుమారుడిని తల్లిదండ్రులు రాము, రాజేశ్వరిలు ఎత్తుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్‌గౌడ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment