
రిహాన్ మృతదేహం
నెల్లూరు , ఆత్మకూరు: నాలుగేళ్ల చిన్నారి రోడ్డుకు అవతల ఉన్న దుకాణంలో చాక్లెట్ కొనుక్కున్నాడు. ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వెళుతున్న ఆటో ఢీకొని మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఆత్మకూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అశ్వినీపురం గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ షరీఫ్, షహీదాబేగం భార్యాభర్తలు. వీరికి షేక్ రిహాన్ (4), ఒక కుమార్తె ఉన్నారు. షరీఫ్ బతుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలో ఉంటాడు.
అతని భార్య పిల్లలను చదివించుకుంటూ గ్రామంలో ఉంటోంది. గురువారం మధ్యాహ్నం రిహాన్ అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చాడు. చాక్లెట్ కొనుక్కునేందుకు రోడ్డు అవతల ఉన్న దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ఆత్మకూరు నుంచి అనంతసాగరం మండలం ఆమానిచిరువెళ్లకు వెళుతున్న ఆటో వేగంగా రిహాన్‌ను ఢీకొంది. దీంతో బాలుడు తీవ్రగాయాలపాలై రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గుర్తించి అతడిని చికిత్స కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కొడుకు చనిపోవడంతో షహీదాబేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు ఇన్‌చార్జి ఎస్సై కె.విక్రమ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment