సాక్షి, భైంసా, నేరడిగొండ: రైతు కుటుంబం పెట్టుకున్న ఆశలసౌధాన్ని కూల్చేసింది. జలపాతంలో సరదాగా విహరించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మోదులే శ్రీకాంత్ (20) అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బాసర మండలం దోడాపూర్ గ్రామానికి చెందిన మోదులే లాలప్ప, నాగరబాయి దంపతులు తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు సంతోష్, చిన్న కొడుకు శ్రీకాంత్‌తో పాటు కూతుర్ని చదివించారు. నిరుపేద కుటుంబం కావడంతో సంతోష్ చదువు మధ్యలోనే ఆపేశాడు. తాను చదువుకోకపోయినా అన్న ఉన్నత చదువులు చదవాలని అన్న సంతోష్‌ను చదివించేందుకు ముందుకొచ్చాడు. మహారాష్ట్రలో హోటల్ నడుపుతూ సంతోష్‌కు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు.
విహారయాత్రకు వెళ్లి..
నిర్మల్ జిల్లా బాసర మండలం దోడపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ మహరాష్ట్రలోని నాందేడ్‌లో టీ కొట్టు నడుపుకుంటున్నాడు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా శ్రీకాంత్ సోమవారం సరదాగా గ్రామంలోని తన మిత్రులతో కలిసి ఉదయం 9.30గంటలకు బయల్దేరారు. నిర్మల్ జిల్లాలోని కదిలి పాపేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కుంటాల జలపాతానికి సాయంత్రం 4.30గంటలకు చేరుకున్నారు. జలపాతానికి వెళ్లిన తర్వాత జలధారాల వద్ద శ్రీకాంత్ 4.45గంటల సమయంలో గల్లంతయ్యాడని స్నేహితులు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్సై భరత్‌సుమన్ జాలర్లతో గాలించారు. 7.50గంటల సమయంలో జలపాతంలో శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. అయితే మిత్రులు సరదాగా కోసం వచ్చి ఇలా మిత్రుడిని కోల్పోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతానికి ఆహ్లాదం కోసం వచ్చిన ప్రకృతి ప్రియులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నా వినకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది విహార యాత్రకు వచ్చి వారి కుటుంబాలకు విషాదాన్ని మిగిలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment