పోలీసుల అదుపులో నిందితుడు వీరాచారి
మూడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలకు స్థానికులు రావడంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఏమీ తెలియనట్టు దొంగలు దాడి చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు.. అతడి ప్రవర్తనలో మార్పును గమనించి పోలీసులు లోతుగా విచారించడంతో అసలు గుట్టు బయటపడగా.. చివరకు కటకటాల పాలయ్యాడు.
నల్లగొండ ,చౌటుప్పల్ (మునుగోడు) : వలిగొండ మండలం కమ్మగూడెం ప్రాంతంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మహిళపై జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని బుధవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 09వ వార్డుకు చెందిన నర్సింగోజు వీరాచారి(35), అదే వార్డుకు చెందిన బైరు రాణి(35)లు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రాణికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. కుమార్తె మేడ్చల్ జిల్లా కీసరలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతోంది. ఈ నెల 07న కూతురు వద్దకు వెళ్లింది. 8న గురుకులంలో జరిగే పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉందని ప్రియుడైన వీరాచారికి హైదరాబాద్ నుంచి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా అంగీకరించాడు. తాను బైకుపై సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లికి వస్తాను, నీవు హైదరాబాద్ నుంచి బస్సులో అక్కడికి రావాలని సూచించాడు. ఆ ప్రకారంగా రాణి 07న రాత్రి 10గంటలకు నార్కట్‌పల్లిలో బస్సు దిగింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన వీరాచారి ఆమెను బైకుపై తీసుకెళ్లాడు. చిట్యాల వద్ద ఆగి టిఫిన్ చేసి బయలుదేరారు.
మార్గమధ్యలో హత్య చేసేందుకు కుట్ర
రాణి ఇతరులతోనూ సఖ్యతగా మెలుగుతోందని వీరాచారి అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా కీసరకు వెళ్లే ప్రయాణాన్ని ఆసరగా చేసుకున్నాడు. ముందస్తుగానే పతకం వేసుకున్న వీరాచారి తన వెంట చిన్నపాటి కత్తులు తెచ్చుకున్నాడు. చిట్యాల నుంచి బయలుదేరాక అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కమ్మగూడెం వద్ద రోడ్డు పక్కన బైకు ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ఘర్షణ తలెత్తింది. అదే కోపంలో తన వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతులో, కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంత మంది వ్యక్తులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రాణిని ఆస్పత్రికి తరలించారు.
దొంగలు దాడి చేశారని..
వీరాచారి తెల్లవారుజామున పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు తమ బైకును ఆపి కత్తులతో దాడి చేసి తన భార్య బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటన, వీరాచారి ఫిర్యాదుకు తేడా ఉండడంతో అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో బుధవారం నిందితుడు నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద సంచరిస్తుండగా ఏసీపీ సత్తయ్య అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రిమాండ్ నిమిత్తం అతన్ని రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ ఏవీరంగ, వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment