
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రిషిత , రమేష్ మృతదేహం, రమేష్ (ఫైల్)
సనత్‌నగర్: ప్రియురాలు ఆత్మహత్యతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియుడు సైతం నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కుటుంబం కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. యాదగిరి కుమార్తె రిషిత (18) కూకట్‌పల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన వెంకటేష్ కుమారుడు రమేష్ (26) జగద్గిరిగుట్టలో ఉంటూ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఫతేనగర్‌లో ఉండే మేనమామ ఇంటికి రమేష్ తరచూ వస్తుండేవాడు.
ఈ క్రమంలో ఆ ఇంటికి సమీపంలోనే ఉండే రిషితతో ఏర్పడిన పరిచయం ఇరువురి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రిషిత సోదరుడు వీరి ప్రేమను వ్యతిరేకించడమే కాకుండా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రిషిత ఈ నెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రేమికుడు రమేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. తన ప్రేయసి రిషిత లేని జీవితం తనకు వద్దంటూ అయినవారు, స్నేహితుల వద్ద చెప్పాడు. ఇదే క్రమంలో అందరూ చూస్తుండగా ఈ నెల 29న సాయంత్రం నాలుగతంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు దూకాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రియురాలు ఆత్మహత్యను జీర్ణించుకోలేక మనోవేదనతోనే రమేష్ ప్రాణాలు తీసుకున్నాడని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment