పోలీస్‌లు అరెస్టు చేసిన నిందితుడు అచ్చిరెడ్డి
నాగోలు: ఓ కంపెనీలో కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ప్రియురాలి చికిత్స కోసం కంపెనీ సొమ్మునే కాజేశాడు. రూ.8.50 లక్షలు దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. అయితే వ్యూహం బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయాడు. ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సూర్యపేట జిల్లా కోదాడ, కపుగల్లుకు చెందిన తిరుపతిరెడ్డికి స్థానికంగా పేపర్ మిల్స్ కంపెనీ ఉంది. ఆయన నగరంలోని పలు పరిశ్రమలకు ముడి సరుకు, విస్తర్లు సరఫరా చేస్తుంటాడు. తిరుపతి రెడ్డి దూరపు బంధువు, అల్లుడి వరుసయ్యే మారం అచ్చిరెడ్డి(28) ఎంబీఏ పూర్తి చేయడంతో తన కంపెనీలో అకౌంటెంట్, కలెక్షన్ బాయ్‌గా ఉద్యోగంలో పెట్టుకున్నాడు.
కస్టమర్లనుంచి పెద్ద ఎత్తున నగదు వసూలవుతుండటంతో దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అచ్చిరెడ్డి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోచికిత్స కోసం డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 25న ఐడీపీఎల్ బాలానగర్, అంబర్‌పేట్‌లో రూ. 8.50 లక్షలు వసూలు చేసుకుని ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. అనంతరం గుర్రంగూడలో రాజారెడ్డి వద్ద మరో రూ. 26, 500 వసూలు చేసుకుని జేబులో పెటుకున్నాడు. ఆ డబ్బును కాజేయాలని నగదును ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి గుర్రంగూడలోని ఓ ప్రదేశంలో దాటి పెట్టాడు. తరువాత పథకం ప్రకారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి దారి దోపీడీ చేసి నగదు ఎత్తుకుపోయారని యజమాని తిరుపతిరెడ్డి సమాచారం అందించాడు. దీంతో యజమాని మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో పోలీసులు గుర్రంగూడ–నాదర్‌గుల్ రోడ్డులోని సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు. అచ్చిరెడ్డి చెప్పినట్లు ముగ్గురు వ్యక్తులు వెళ్లిన వాహనం ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అచ్చిరెడ్డి అసలు విషయం బయట పెట్టాడు. నగదు మొత్తాన్ని కాజేయాలనే తానే ఈ డ్రామా అడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు రూ. 8.50. 950 లక్షలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. సమావేశంలో రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి, క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థాలిపురం ఏసీపీ జయరామ్, సీసీఎస్ సీఐలు పార్థసారధి, నవీన్‌రెడ్డి, అశెక్‌కుమార్, మధుకుమార్, మీర్‌పేట సీఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment