
హస్తినాపురం: ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేటకు చెందిన కొటిక లక్ష్మి, చంద్రశేఖర్ దంపతుల కుమార్తె పల్లవి(28)కి గత డిసెంబర్ 8న నల్గొండ జిల్లా, మునుగోడు పట్టణానికి చెందిన సామవరపు సంతోష్‌తో వివాహం జరిగింది. నూతన దంపతులు శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి తన బెడ్ రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి వెళ్లిన ఆమె అత్తమామలు పల్లవికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వారు కిటికీలోంచి చూడగా పల్లవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని మృతురాలి అత్తమాలకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.