స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, ఆరాధన,ఉమేష్
హైదరాబాద్, నాగోలు: స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్ ఆర్టీసీకాలనీకి చెందిన ఆరాధనరెడ్డి అనే విద్యార్థిని. రామంతాపూర్ ఇందిరానగర్‌కు చెందిన ఉమేష్ (19) స్నేహితులు. ఆరాధన రెడ్డి సోదరుడు అమర్ రాజ్‌కుమార్‌రెడ్డి అలియాస్ డోల మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై పీడీయాక్ట్ నమోదు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
అతని సోదరి ఆరాధనరెడ్డి అన్న చోరీ చేసిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చేది. అమర్ రాజ్‌కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె ఉమేష్‌తో కలిసి చోరీలకు పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్న తన స్నేహితురాలైన భావిక ఇంటికి వెళ్లింది. ఉమేష్ బయటే ఉండగా ఆరాధనరెడ్డి భావికను మాటల్లో పెట్టి ఇంట్లో ఉన్న 17 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భావిక ఇంట్లో దొరికిన రాజ్‌కుమార్‌రెడ్డి ఫోటో ఆధారంగా ఆరాధనరెడ్డి, ఉమేష్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాచకొండ క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, మీర్‌పేట సీఐ మన్మోహన్, డీఐ మధుసూదన్, ఏడీఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment