సోమవారం సాయంత్రం భవనంపై జారి పడి మృతి చెందిన బత్తుల సుమన్ సోమవారం మారేడుమిల్లి పీహెచ్‌సీలో అపస్మారక స్థితిలో ఉన్న బత్తుల శాంసన్
తమ్ముడి మరణాన్ని ఆ అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఎప్పుడూ తనతో పాటు కలిసిమెలిసి తిరిగే సోదరుడు ఇక లేడన్నవిషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం): అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఆవిరైపోతున్న ప్రస్తుత రోజుల్లో ఒకరి కోసం మరొకరు అన్నదమ్ములు మృతు ఒడికి చేరుకోవడం ఆ కుటుబంలో పెనువిషాదాన్ని నింపింది. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన తమ్ముడు సాయంత్రానికి ఒక్కసారిగా మృతువాత పడడంతో అతడి మరణాన్ని జీర్ణించుకోలేని అన్నయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసరాగా ఉంటారనుకునే కొడుకులు ఒకరి తరువాత ఒకరు దూరమవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మారేడుమిల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది.
స్థానిక అద్దరవీధికి చెందిన బత్తుల సుమన్(25) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు. అతడి మరణాన్ని చూసి తట్టుకోలేని అన్నయ్య బత్తుల శాంసన్(30), తమ్ముడు మృతి చెందిన గంట వ్యవధిలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడాడు. ఇది గమనించిన బంధువులు, స్నేహితులు, హుటహుటిన స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుల తండ్రి గతంలో మరణించగా, వారికి అమ్మ, ఒక చెల్లెలు ఉంది. అన్నదమ్ములిద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నకొడుకు మృతి వార్త విన్న తల్లి మేరీ గుండె పగిలేలా రోదించింది. పెద్ద కొడుకు మరణం ఆమెను మరింత కుంగదీయడంతో ఆమె కుప్పకూలింది. తోబుట్టువులు ఇద్దరూ మరణించడంతో వారి చెల్లి రోదించిన తీరు స్థానికులతో కంటతడిపెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment