ఆస్పత్రి వద్ద ఏడాదిన్నర కుమారైతో మృతుడి భార్య, (ఇన్‌సెట్)లో వనేష్ మృతదేహం
చీరాల రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా కత్తి పోటుకు గురై తమ్ముడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చీరాలలో జరిగింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఉద్దేశ పూర్వకంగా జరిగిందా..అనే విషయంపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందిన వివరాల ప్రకారం.. స్థానిక థామస్‌పేటకు చెందిన బడుగు ఏలియా, బడుగు వనేష్ (35)లు అన్నదమ్ములు, వీరు చీరాల నెహూ కూరగాయల మార్కెట్ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. సాయంత్రం సమయంలో పండ్ల దుకాణం వద్ద డబ్బుల విషయంలో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఏం జరిగిందో ఏమోగానీ వనేష్ ఎడమ చేతిపై కత్తి గాటుతో రోడ్డుపై పడిపోయాడు.
చేతి నరం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వనేష్ మృతి చెందాడు. కత్తితో వనేష్‌పై ఏలియా దాడి చేశాడా.. వనేష్ తనకు తానే కత్తితో కోసుకున్నాడా.. అనే విషయాలపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య సంధ్య, ఐదేళ్ల సాల్మన్‌వెస్లీ, ఏడాదిన్నర అబూజ రాణిలు ఉన్నారు. భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న సంధ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించింది.
మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, టూటౌన్ సీఐ రామారావు, ఒన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ విషయమై ఒన్‌టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా డబ్బులు విషయంలో గొడవ జరగడంతో బావ ఏలియానే తన భర్త వనేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడంటూ సంధ్య ఫిర్యాదు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment