దుర్గారావు మృతదేహం
కోల్‌సిటీ(రామగుండం): ఆస్తి తగాదాలతో తమ్ముడిని అన్న హతమార్చిన సంఘటన గోదావరిఖనిలో సోమవారం జరిగింది. తల్లిపై కత్తితో దాడి చేయడానికి వెళ్లిన అన్నను అడ్డుకున్న తమ్ముడు ధనాల దుర్గారావు(23) అలియాస్ చంటి కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమవతుండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలు. గోదావరిఖని లెనిన్‌నగర్‌కు చెందిన ధనాల రామారావు, ఈశ్వరీ దంపతులకు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్, శివశంకర్, దుర్గారావు అలియాస్ చంటి(23), ఇద్దరు కూతుళ్లు. రామారావు సింగరేణి స్కూల్‌లో పనిచేస్తున్నారు. పెద్దకుమారుడు ధనాల చంద్రశేఖర్ రామగుండంలో భార్య, పిల్లలతో ఉంటున్నారు. రెండో కుమారుడు శివశంకర్ కుటుంబంతో మరో ఊరిలో ఉంటున్నారు. సోమవారం కరీంనగర్‌లో భార్య పరీక్షలు రాయడానికి ఆమెతో వచ్చి న శివశంకర్..అనంతరం ఇద్దరు గోదావరిఖనికి వచ్చారు.
సాయంత్రం మద్యంమత్తులో ఇంటికొచ్చిన పెద్ద కుమారుడు చంద్రశేఖర్, ఇంట్లో తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. రూ.2లక్షలు, ఇంట్లో వాటా కావాలని డిమాండ్ చేయగా తల్లి నిరాకరించింది. తల్లిదండ్రులతోపాటు రెండో తమ్ముడు శివశంకర్ సముదాయించిన శాంతించలేదు. అదే సమయంలో బయట నుంచి అప్పుడే వచ్చిన చిన్నతమ్ముడు దుర్గారావు సైతం అన్నను సుమదాయించే ప్రయత్నం చేశాడు. అయినా చంద్రశేఖర్ వినకుండా తీవ్ర ఆగ్రహంతో తల్లిపై కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుకున్న తమ్ముడు దుర్గారావును అదే కత్తితో పొడిచాడు. ఎడమ తొడకు బలమైన కత్తిపోట్లు కావడంతో తీవ్రరక్తస్రావమైంది. హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. చిన్నకొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచారు. చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు, సీఐ వాసుదేవరావు పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment