ఇద్దరు చిన్నారులను మింగేసిన దేవగుడి చెరువు నీటిగుంత
బ్రహ్మ చేసిన బొమ్మలు బాలలైతే..బాలలు చేసిన బొమ్మ దేవుడుకాలేకపోయాడా..వేసవి సెలవుల్లో సంబరంగా గడపాల్సిన చిన్నారులు..నాలుగు నెలల ముందే చవితి సంబరం చేద్దామని..ముద్దు ముద్దుగా మట్టి ముద్దను పితికిబొజ్జ గణపయ్య ప్రతిమ చేసి..భక్తిభావంతో ముచ్చటగా పూజచేసి..నీట ముంచి నిమజ్జనం చేయబోతే.. ఆ నీటిలోనే మునిగి నిండు ప్రాణాలు వదిలి.. కన్నశోకం మిగిల్చి.. కడుపుకోత నింపిరి..కళ్లముందు చెంగుచెంగుమని గెంతాల్సిన తనయులుకట్టిలా నిర్జీవమై పడి ఉన్న బిడ్డలను చూసి..తల్లిదండ్రుల గుండె ‘చెరువు’ అయ్యిందిఅమడగూరు ఎస్సీ కాలనీ శోకసంద్రమైంది..
అమడగూరు: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకని వెళ్లి జలసమాధి అయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన అమడగూరు ఎస్సీ కాలనీకి చెందిన పులగల్లు రామాంజినేయులు, నరసమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు సుమంత్ (10), సునీత్ (8). రామాంజనేయులు పెయింటర్‌గా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో సుమంత్ ఐదో తరగతి, సునీత్ మూడో తరగతి పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో ప్రతి రోజూ స్నేహితులతో కలిసి ఆడుకునేవారు. ఆదివారం రాత్రి కురిసిన వానకు దేవగుడి చెరువులోని పెద్ద, చిన్న గుంతల్లో నీరు చేరింది. పక్కనే ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన పిల్లలంతా చెరువులో ఆడుకోవడానికి వెళ్లారు.
వినాయక నిమజ్జనం కోసం వెళ్లి..
చెరువులో ఎక్కడ చూసినా బంకమట్టి ఉండటంతో పిల్లలు తమ చిట్టిచేతులతో వినాయకుడి బొమ్మలను తయారు చేశారు. అక్కడే కాసేపు ఆడుకున్న తర్వాత బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేయడానికి ఉపక్రమించారు. సునీత్ తన వినాయకుడి బొమ్మను తీసుకుని నీటిగుంతలోకి దిగాడు. అలా కొద్దికొద్దిగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో లోతైన ప్రదేశంలోకి చేరుకున్నాడు. మునిగిపోతున్న తమ్ముడిని చూసి కాపాడేందుకు ప్రయత్నించిన సుమంత్ కూడా మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి కాలనీలోకి పరుగులు తీసి జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే కాలనీవాసులు చెరువు వద్ద నీటి గుంతలోకి దిగి వెతకడం ప్రారంభించారు. గంటపాటు వెతికి అన్నదమ్ముల (సుమంత్, సునీత్‌ల)ను బయటకు తీయగా.. అప్పటికే వారు విగత జీవులుగా మారిపోయారు.
తల్లిదండ్రుల అరణ్యరోదనలు
ఉన్న ఇద్దరు కుమారులు జలసమాధి కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఆసరా ఎవరు స్వామీ, మీరు లేకుంటే ఇక మేమెందుకంటూ పేగు బంధం తెంచి జన్మనిచ్చిన ఆ తల్లితండ్రులు విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ప్రతి ఒక్కరి కళ్లూ నీటితో నిండిపోయాయి. ఎస్‌ఐ రాఘవయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment