
వివరాలు వెల్లడిస్తున్న క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్, పక్కన ఏడీసీపీ సురేష్‌బాబు
విశాఖ క్రైం: వారిద్దరూ సొంత అన్నదమ్ములు. వ్యసనాలకు బానిసలు కావడంతో దొంగతనాల బాట పట్టారు. బంధువులు, స్నేహితులనే టారెŠగ్‌ట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మానవత్వం మరిచిపోయి సొంత మేనత్త పీక నులిమి ఆమె మెడలోని గొలుసు అపహరించుకుపోయారు. సుమారు నాలుగేళ్ల పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లకు నమ్మకంగా వెళ్లి దొంగతనాలు చేసిన వీరిరువురు... గడిచిన ఏడాదిన్నర నుంచి ఒంటరిగా కనిపించే మహిళల మెడలోని చైన్‌లు తెంపుకుపోవడమే పనిగా పెట్టుకున్నారు. పలు స్టేషన్లలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిలో ఒకరు పోలీసులకు గురువారం చిక్కాడు. వీరికి సహకరించిన బంగారం వ్యాపారిని, 144 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ2 నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ వివరాలు వెల్లడించారు. గండిగుండం గ్రామానికి చెందిన గండ్రెడ్డి అప్పలరాజు (36), గండ్రెడ్డి సత్తిబాబు(32) అన్నదమ్ములు. కూలి పని చేసుకుంటూ, ఆటో నడుపుకొని జీవనం సాగించే వీరు వ్యసనాలకు బానిసలయ్యారు.
ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో 2013 నుంచి దొంగతనాల బాటపట్టారు. చోరీ చేసిన బంగారం విక్రయించేందుకు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన గొరస రమేష్‌తో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అడవివరం బైరవస్వామి గుడి ప్రాంతంలో ఎక్కువగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతుండడంతో ఎస్‌ఐ గోపి నిఘా పెంచారు. చేతికి ఆరు వేళ్లు కలిగిన వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో చేతికి ఆరు వేళ్లు కలిగిన గండ్రెడ్డి అప్పలరాజు ఈ ప్రాంతంలో గురువారం అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలన్నీ వెలుగుచూశాయి. మొత్తం 15 కేసుల్లో నిందితునిగా ఉన్న గండ్రెడ్డి అప్పలరాజును, ఆభరణాలు కొనుగోలు చేసిన రమేష్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఎ – 2 నిందితుడు సత్తిబాబు పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నట్లు క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ ప్రకటించారు. ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారంతోపాటు 144 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరి చేశామని తెలిపారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఎస్‌ఐలు గోపి, జి.డి.బాబు(పెందుర్తి), సుధాకర్, పోలీస్ కానిస్టేబుల్ చిట్టిబాబు, అప్పలరాజు, నర్శింగరావు పాల్గొన్నారు.
బంధువులు, స్నేహితులే బలి
♦ గండ్రెడ్డి అప్పలరాజు, గండ్రెడ్డి సత్తిబాబు తమ దొంగతనాలను మేనత్త ఇంటి నుంచే ప్రారంభించారు. 2013 ఏప్రిల్ నెలలో గండిగుండం గ్రామానికి చెందిన తమ మేనత్త వాకాడ సింహాచలం ఇంటిలో రెండు బంగారు నక్లెస్‌లు దొంగతనం చేశారు.
♦ 2014 ఏప్రిల్‌లో మేనత్త వాకాడ సింహాచలం జీడితోటలో పిక్కలు ఏరుతుండగా... ఆమె ముక్కు, నోరు మూసి పీక నులిమేసి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని 29 గ్రాముల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ బంగారాన్ని పెందుర్తి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ కంపెనీలో అప్పలరాజు తాకట్టుపెట్టాడు.
♦ 2014 అక్టోబర్‌లో అక్కిరెడ్డిపాలెంలో బంధువు కోన దుర్గమ్మ ఇంటిలో బంగారు గొలుసు అపహరించారు.
♦ 2015 జనవరిలో సరిపల్లి గ్రామంలోని బంధువు అడ్డూరి కొండమ్మ ఇంటిలో రెండు బంగారు ఎత్తుగొలుసులు చోరీ చేశారు.
♦ 2015 మే నెలలో శొంఠ్యాం గ్రామంలోని స్నేహితుడు బొద్దపు పోలినాయుడు ఇంటిలో బంగారు తాడు దొంగతనం చేశారు.
♦ 2016 మార్చి, ఏప్రిల్‌లో స్నేహితుల ఇళ్లలో పుస్తెల తాడు, చైను అపహరించుకుపోయారు.
♦ 2016 అక్టోబర్ నెలలో సరిపల్లి గ్రామంలో సొంత అత్త ఇంటిలోని జుంకాలను అప్పలరాజు అపహరించాడు.
♦ 2016 అక్టోబర్ నెలలో సింహాచలం బస్టాండ్ వద్ద ఒక మహిళ మెడ నుంచి పుస్తెల తాడు తెంపుకొని ఉడాయించారు.
♦ 2017 సెస్టెంబర్‌లో మామిడిలోవ గ్రామంలోని స్నేహితుడు రవి ఇంటిలో బంగారు నల్లపూసల దండ దొంగతనం చేశారు.
♦ 2017 ఆగస్టు, అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు ప్రాంతాల్లోని ఐదుగురు మహిళల మెడల్లోని పుస్తెల తాళ్లు తెంపుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment