నిందితులు జావేద్, జునైద్
నేరేడ్‌మెట్: ప్రయాణికుల్లా బస్సు ఎక్కుతారు. టికెట్ తీసుకుంటారు. తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనవతరం లూటీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోతారు. ప్రయాణికుల ముసుగులో ప్రైవేట్ లగ్జరీ బస్సులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం, అమ్రోహ జిల్లా, చుచిలా కలాన్ గ్రామానికి జావేద్ చౌదరి బ్యాగుల వ్యాపారం చేసేవాడు. అతను అదే ప్రాంతానికి చెందిన కూలర్ మెకానిక్ మహ్మద్ జునైద్, జావేద్ చౌదరి బావ షాబాన్‌ఖాన్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ముగ్గురు కలిసి గత మూడేళ్లుగా బస్సుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ లగ్జరీ బస్సుల్లో టికెట్లు బుక్‌చేసుకొని ప్రయాణం చేసేవారు.. బస్సుల్లో తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనంతరం ఇద్దరు నిందితులు ప్రయాణికుల లగేజీని కిందకు దించుతుండగా, మూడో నిందితుడు బస్సులో ఎవరైనా గమనిస్తున్నారా.. అని పరిశీలించేవాడు.
అనంతరం ఇద్దరూ సీట్లో కూర్చొని బ్యాగ్‌లు, బ్రీప్‌కేస్‌లపై బ్లాంకెట్ కప్పి చిన్న టార్చిలైట్ వెలుతురులో వాటిని తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అనంతరం బ్యాగ్‌లు, బ్రీప్‌కేస్‌లను యధాస్థానంలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోయేవారు.గత ఫిబ్రవరి 6న నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దీనదయాళనగర్‌కు చెందిన వెంకటరమణ, తన భార్య భాస్కర లక్ష్మితో కలిసి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో వచ్చాడు. ఎల్‌బీ నగర్‌లో బస్సు దిగి ఇంటికి చేరుకున్న వారు తమ బ్యాగ్‌లను పరిశీలించగా అందులో ఉన్న 15.8 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిబ్రవరి 7న నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్ పోలీసుల విచారణలో విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రబాద్‌లో జావేద్‌చౌదరి అతని సహాయకుడు మహ్మద్ జునైద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. కొన్నేళ్లుగా ఈ తరహా లూటీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారని ఏసీపీ తెలిపారు. వారి నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు, మాస్టర్ కీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఎక్కడెక్కడ దోపిడీలు చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేరేడ్‌మెట్ సీఐ నర్సింహ్మస్వామి, ఎస్‌ఓటీ సీఐ శివకుమార్, డీఐ రాజేందర్‌గౌడ్, ఎస్‌ఐ అవినాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment