Interstate thieves gang
-
విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
-
కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు..!
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్ విసురుతున్న భుక్యా నాయక్ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు. వందల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన భుక్యా నాయక్ ముఠా నుంచి 54లక్షలు విలు చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9లక్షల 65వేల నగదు, ఒక ల్యాప్ ట్యాప్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యనాయక్ తోపాటు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు, బాణావత్ రాజా, నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్ కూమార్ మరో మైనర్.. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులున్నాయని తెలిపారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్, పవన్ కూమార్ ఇప్పటికే జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. భుక్యా నాయక్ ముఠా అరెస్టుతో అనేక దొంగతనాలు బయటపడ్డాయని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు -
ప్రయాణికుల ముసుగులో బస్సు దోపిడీలు
నేరేడ్మెట్: ప్రయాణికుల్లా బస్సు ఎక్కుతారు. టికెట్ తీసుకుంటారు. తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనవతరం లూటీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోతారు. ప్రయాణికుల ముసుగులో ప్రైవేట్ లగ్జరీ బస్సులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం, అమ్రోహ జిల్లా, చుచిలా కలాన్ గ్రామానికి జావేద్ చౌదరి బ్యాగుల వ్యాపారం చేసేవాడు. అతను అదే ప్రాంతానికి చెందిన కూలర్ మెకానిక్ మహ్మద్ జునైద్, జావేద్ చౌదరి బావ షాబాన్ఖాన్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ముగ్గురు కలిసి గత మూడేళ్లుగా బస్సుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ లగ్జరీ బస్సుల్లో టికెట్లు బుక్‌చేసుకొని ప్రయాణం చేసేవారు.. బస్సుల్లో తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనంతరం ఇద్దరు నిందితులు ప్రయాణికుల లగేజీని కిందకు దించుతుండగా, మూడో నిందితుడు బస్సులో ఎవరైనా గమనిస్తున్నారా.. అని పరిశీలించేవాడు. అనంతరం ఇద్దరూ సీట్లో కూర్చొని బ్యాగ్‌లు, బ్రీప్కేస్లపై బ్లాంకెట్ కప్పి చిన్న టార్చిలైట్ వెలుతురులో వాటిని తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అనంతరం బ్యాగ్‌లు, బ్రీప్కేస్లను యధాస్థానంలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోయేవారు.గత ఫిబ్రవరి 6న నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దీనదయాళనగర్కు చెందిన వెంకటరమణ, తన భార్య భాస్కర లక్ష్మితో కలిసి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో వచ్చాడు. ఎల్బీ నగర్లో బస్సు దిగి ఇంటికి చేరుకున్న వారు తమ బ్యాగ్‌లను పరిశీలించగా అందులో ఉన్న 15.8 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిబ్రవరి 7న నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసుల విచారణలో విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రబాద్‌లో జావేద్చౌదరి అతని సహాయకుడు మహ్మద్ జునైద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. కొన్నేళ్లుగా ఈ తరహా లూటీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారని ఏసీపీ తెలిపారు. వారి నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, మాస్టర్ కీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఎక్కడెక్కడ దోపిడీలు చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మస్వామి, ఎస్ఓటీ సీఐ శివకుమార్, డీఐ రాజేందర్‌గౌడ్, ఎస్ఐ అవినాష్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట దొంగలు అరెస్ట్
నాగోలు: చోరీలకు పాల్పడుతున్న అంతరరాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.32లక్షల విలువైన 94తులాల బంగారు ఆభణాలు, ఓ బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భరత్‌భూషన్ భన్సల్(52), మధ్యప్రదేశ్‌కు చెందిన మత్తుర ప్రతాప్ (42) పాత నేరస్తులు. భరత్‌భూషన్ ఉత్తరప్రదేశ్ పరిసరప్రాంతాల్లో పలు చోరీలుచేశాడు. అక్కడి ప్రాంత పోలీసులు గుర్తించడంతో 2009నుంచి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో చోరీలకు చేయడం మొదలుపెట్టాడు. అప్పడికే జైల్లో పరిచయమైన ప్రసాద్‌తో కలసి సౌత్ ఇండియాలో చోరీలు చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో భరత్‌భూషన్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ట్రైన్ ద్వారా పార్సల్ పంపించి నగరానికి వచ్చిన తర్వాత లోకల్ నెంబర్‌ను యూపీని ఏపీ సిరీస్‌గా మార్చి కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళాలు వేసియున్న ఇళ్లను లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఎప్పుడైనా పోలీసులకు పట్టుపడితే తాము మార్వీడీస్ అని మార్బుల్స్ షాప్‌లో పనిచేస్తున్నామని చెబుతూ లాడ్జిలో అవాసం చేసుకొని తప్పించుకునే వారు. కొంతకాలంగా నిందితులు గతేడాదిగా ఎల్బీనగర్ డీపీ జోన్ పరిధిలో హయత్‌నగర్, వనస్థలి పురం, మీర్‌పేట పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. తరచుగా దొంగతనాలు పెరిగిపోవడంతో వీరిపై దృష్టి సారించిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు ద్విచక్రవాహనం తిరుగుతున్న వీరిని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐటీసెల్ పోలీసులు, రైల్వే పార్కింగ్ దగ్గర సీసీ కెమెరాల్లోనూ వీరిని గుర్తించి పోలీసులను 45 రోజుల శ్రమతో ఇద్దర నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని విచారంగా భరత్‌భూషన్ పై 66కేసులు నమోదయ్యాయని, ప్రసాద్‌పై కూడా అనేక కేసులున్నాయని సీపీ తెలిపారు. భరత్‌భూషన్ ఉత్తర ప్రదేశ్‌లో కోటి రూపాయల విలువైన ఇళ్లు ఉందని సీపీ వెళ్లడించారు. ఈ సందర్భంగా అంతరరాష్ట్ర ముఠాను పట్టుకునన్న పోలీసులను సీపీ అభినందించి నగదు రివార్డు అందజేశారు. అడిషనల్ డీసీపీ క్రైం డి.శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్.శ్రీధర్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, సీసీఎస్ సీఐలు ప్రవీన్‌బాబు, అశోక్‌కుమార్, హయత్‌నగర్ డీఐ జితేందర్‌రెడ్డి, ఎస్ఐలు ముదాసీన్ అలీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా ఆయుధాల రవాణా
నాగోలు: నగరంలో అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్థుల్ని ఎల్బీనగర్, మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు పిస్టల్, రెండు బుల్లెట్స్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపిన మేరకు.. మహారాష్ట్ర లోని థానే జిల్లాలోని భివాడీకి చెందిన దత్తు విరేష్ కోహ్లి(31), అదే ప్రాంతానికి చెందిన శ్యాం సుందర్, భూమయ్య వాడపల్లిలు కలసి పిస్టల్ అమ్మకాలు చేస్తున్నారు. దత్తుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జంసీర్ అలియాస్ హుస్సేన్‌లు పరిచయస్తడు అతని వద్ద తక్కువ ధరకు ఆయుధాలను కొనుగోలు చేసి మహారాష్ట్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇతనితో పాటు శ్యాంసుందర్‌కూడా మహారాష్ట్ర, తెలంగాణలో అక్రమంగా పిస్టల్స్ తీసుకువచ్చి అమ్ముతున్నారు. దత్తు విరేష్ కోహ్లీ, శ్యాంసుందర్ నగరానికి వచ్చి ఎల్బీనగర్ ప్రాంతంలో శ్రీ సాయి లాడ్జిలో మకాం వేశారు. లాడ్జీలో ఉంటూ నగరంలో వీటిని అమ్మేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి వీరి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందుతుడైన జంసీల్ అలియాస్ హుస్సేన్ పరారీలో ఉన్నాడని ఇతని కోసం స్పెషల్ పార్టీ ఆఫీసర్లు గాలింపు చేపట్టారని తెలిపారు. పారిపోయిన నిందితుడికి నగరంలో పాత కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ నవీన్ కుమార్, అశోక్ రెడ్డి, ఎస్సైలు అవినాష్, రత్నం, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో గత ఏడాది కాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. బాధితుల ఇచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం – నల్లజర్ల మార్గంలో ప్రత్యేక బృందంతో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద బంగారు నగలు ఉన్నాయి. విచారణలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నుగేష్ మణికంఠ, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసుగా గుర్తించారు. పాత నేరస్తులని తేలడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ధనికుల ఇళ్లను కొల్లగొట్టేవారు. దొంగిలించిన బంగారు ఆభరాలను ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యన్ శాంతమూర్తి ద్వారా బంగారు ఆభర దుకాణాలు నిర్వహించే వ్యాపారులు యోగ మురగన్ జ్యువెలరీ షాపు యజమాని యోగ మురుగన్ సింథిల్, న్యూ అంబిక జ్యువెలరీ షాపు దేసింగురాజ్ మనోజ్ కుమార్, నారాయణన్ జ్యువెలరీ షాపు దేవదాస్ నారాయణదాస్, జగన్ సిల్వర్ షాపు గురుస్వామి జగన్‌లకు విక్రయించేవారు. పైన తెలిపిన ముగ్గురు నేరస్తులు, వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొంగిలించిన ఆభరణాలను సుబ్రహ్మణ్యన్ శాంతమూర్తికి విజయవాడ రైల్వేస్టేషన్లో అందజేసేవారు. వీరికి అవసరమైన ఖర్చులకు బంగారు వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారు. వీరి వద్ద నుంచి ఇంకా బంగారం, వెండి రికవరీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక మోటారు సైకిల్‌ను, చోరీకి ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేస్తామని రూరల్ సీఐ పి శ్రీను తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు ఎస్సై బాదం శ్రీనివాసు, భూపతి శ్రీను, దుర్గాప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ పసుపులేటి శ్రీనివాసరావు, రాంబాబులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్నేహం ఏర్పడింది ఇలా.. చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసు ఒక హత్యకేసుకు సంబంధించి శిక్ష పడింది. జైలులో శిక్ష అనుభవిస్తుండగా తణుకు పరిధిలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడిన తమిళనాడుకు చెందిన నుగేష్ మణికంఠ, కార్తీక్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ తమిళనాడుకు చెందిన రామనాథపురం జిల్లాలోని బంగారు, వెండి ఆభరణ వ్యాపారులతో కలిసి చోరీలు ప్రారంభించారు. జిల్లాలో 17 చోరీలు 2017 నుంచి ఉంగుటూరు మండలం రామచంద్రపురంలో ఒకటి, గొల్లగూడెం ఒకటి, ఉంగుటూరులో రెండు, నిడమర్రులో ఒకటి, తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెదతాడేపల్లిలో ఒకటి, వెంకట్రామన్నగూడెంలో రెండు, ఆరుళ్లలో ఒకటి, జగన్నాథపురంలో ఒకటి, పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడులో ఒకటి, రావిపాడులో ఒకటి, ఆకుతీగపాడులో ఒకటి, జట్లపాలెం ఒకటి మొత్తం 17 చోరీలు చేసినట్టు నేరస్తులు అంగీకరించారు. -
ఇదేమీ క్రైం సినిమా కథ కాదు..
టిప్‌టాప్‌గా తయారై, ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో విమానంలో దర్జాగా దిగుతాడు. అప్పటికే విమానాశ్రయం వద్ద కొన్ని కార్లలో కొందరు అతని కోసం నిరీక్షిస్తుంటారు. వారితో కలసి కార్లలో నగరంలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన ఖరీదైన కాలనీలు, అపార్టుమెంట్లలో రాత్రి వేళల్లో ప్రవేశించి దొంగతనం చేస్తాడు. ఎవరైనా గుర్తిస్తే నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తాడు. పని ముగించుకుని వేషం మార్చుకుని అంతే దర్జాగా మళ్లీ విమానంలో మరో నగరానికి వెళ్లిపోతాడు. ఇదేమీ క్రైం సినిమా కథ కాదు. దేశంలో 14 ఏళ్లుగా 10 రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా రియల్ స్టోరీ ఇదీ. ఈ ముఠాకు నాయకుడే సత్పాల్సింగ్ అలియాస్ అజయ్ చౌహాన్. సాక్షి, అమరావతి బ్యూరో : హరియాణాలోని గుర్గామ్కు చెందిన సత్పాల్సింగ్ అలియాస్ అజయ్ చౌహాన్ మూడేళ్ల పాటు సైన్యంలో పనిచేశాడు. అందుకే అతన్ని ఫౌజీ అని ఆ ముఠా సభ్యులు సంబోధిస్తారు. గతంలో సత్పాల్సింగ్ ఒకర్ని హత్యచేసి కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదల అయిన అనంతరం 2004లో ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఏర్పాటు చేశాడు. హరియాణా, యూపీ, రాజస్థాన్‌లకు చెందిన 10 మంది ఈ ముఠాలో సభ్యులు. అక్రమంగా ఆయుధాలు సమకూర్చుకుని దొంగతనాలు మొదలుపెట్టారు. నగరాల్లో ధనవంతులు ఉండే కాలనీలు, అపార్టుమెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చెలరేగిపోతోంది. సత్పాల్సింగ్ తాము లక్ష్యంగా చేసుకున్న నగరానికి తమ ముఠా సభ్యులను ముందుగా పంపించి రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం సత్పాల్సింగ్ విమానంలో ఆ నగరానికి చేరుకుంటాడు. రాత్రి వేళలో టిప్‌టాప్‌గా తయారై ల్యాప్‌టాప్ బ్యాగ్ మెడలో వేసుకుని ఎంపిక చేసిన కాలనీలోకి ఖరీదైన కారులో వస్తారు. ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడే ఇతన్ని చూస్తే ఎవరో ఉన్నతాధికారి అని అనుకుంటారు. ముఠా సభ్యులు బయటే ఉంటారు. సత్పాల్సింగ్ ఒక్కడే ఎంపిక చేసుకున్న బంగ్లాలు, అపార్టుమెంట్లలోకి దర్జాగా ప్రవేశిస్తాడు. సీసీ కెమెరాలు ఉంటే వాటిని పనిచేయకుండా చేస్తాడు. గంట వ్యవధిలో దొంగతనం పూర్తి చేసుకుని వెళ్లిపోతాడు. అపార్టుమెంట్లోకి ప్రవేశించేటప్పుడు లిఫ్ట్‌లో వెళ్లే సత్పాల్సింగ్.. వచ్చేటప్పుడు మాత్రం మెట్లు దిగి వస్తాడు. వేషం మార్చుకుని ఆ మర్నాడే విమానం ఎక్కి ఢిల్లీ చేరుకుంటాడు. ఆ తరువాత ముఠా సభ్యులు కూడా వేర్వేరు మార్గాల్లో విమానాల్లో ఢిల్లీ వెళ్తారు. తాము దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ఢిల్లీలో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ ముఠా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. తరచూ గోవా, సిక్కిం, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సా చేస్తుంటారు. ఏటా డిసెంబర్ 31న ఈ ముఠా సభ్యులు గోవాలో పెద్ద పార్టీ చేసుకుంటారని పోలీసులు చెబుతున్నారు. 14 ఏళ్లుగా 10 రాష్ట్రాల్లో హల్చల్ ఇలా సత్పాల్సింగ్ ముఠా 2004 నుంచి దేశంలో వరుస దొంగతనాలతో 10 రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, జైపూర్, భోపాల్, హైదరాబాద్ తదితర నగరాల్లో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కొల్లగొట్టింది. ఆ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. సత్పాల్సింగ్ తమ ముఠా సభ్యులకు అధునాతన రివాల్వర్లు కూడా సమకూర్చాడు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడం, తరచూ వేషాలు మార్చి ఏమారుస్తుండటంతో సత్పాల్సింగ్ ప్రస్తుతం ఎలా ఉంటాడో కూడా పోలీసులు చెప్పలేకపోతున్నారు. 2010లో ఒకసారి మాత్రమే ఢిల్లీ పోలీసులు సత్పాల్సింగ్ను అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిల్‌పై విడుదల అయిన అనంతరం మళ్లీ అతను దొంగతనాలతో చెలరేగిపోతున్నాడు. ఈ ముఠా కోసం తమ తరఫున వాదించేందుకు ఖరీదైన న్యాయవాదులను కూడా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ ముఠా 2017 అక్టోబరులో మన రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఈ తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో 16 చోట్ల దొంగతనాలతో బెంబేలెత్తించింది. ఈ ముఠా సభ్యులు ఇద్దర్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. మరి సత్పాల్సింగ్ ఆటను పోలీసులు ఎప్పుడు కట్టిస్తారో మరి. -
అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్: వాహనాలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీన్లమలలో 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోటి విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వాహనాలను సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
చిత్తూరు (పలమనేరు) : పలమనేరులో గురువారం అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టయ్యింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విరూపాక్షిపురానికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి కిడ్నాప్ కేసును చేధించే క్రమంలో పోలీసులు పలమనేరు- చిత్తూరు రహదారి మీద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు సుమో వాహనాల్లో అనుమానాస్పదంగా ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. వీరంతా చిత్తూరు జిల్లాలో పలువురిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. -
ఏడుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం: జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దోపిడిలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నిస్తే చంపడానికి కూడా వెనకాడటలేదు. దాంతో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. దొంగల ఆగడాలను అరికట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 2.13 లక్షల రూపాయలను, 5వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.