ప్రొద్దుటూరు క్రైం : ‘మంచి సంబంధమని మురిసిపోతిమి కదమ్మా.. అత్తారింటికి వెళ్తావనుకుంటే.. మమ్మల్ని వదలి శాశ్వతంగా దూరమవుతున్నావా తల్లీ.. నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండాలమ్మా.. చిన్నీ.. లేయమ్మా’ అంటూ కుమార్తెను తల్చుకుంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కలచి వేసింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన గోథ్నవితోపాటు మిట్టమిడి వీధిలోని మార్తల సుధాకర్‌రెడ్డి, బి కోడూరు మండలానికి చెందిన కాసా నారాయణరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యువకుడితో గోథ్నవికి నిశ్చితార్థం జరిపించి తిరిగి.. ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో వారి కారు.. ట్రాక్టరును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఇదే ప్రమాదంలో గోథ్నవి తల్లి ఇందిరా, తండ్రి మల్లికార్జునరెడ్డి, లత, పెద్దమ్మ సక్కుబాయ్, డ్రైవర్ మహబూబ్‌బాషాకు గాయాలయ్యాయి. కర్నూలు నుంచి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చారు. తీవ్ర గాయాలైనా మృతురాలి తల్లి, తండ్రి, పెద్దమ్మ సక్కుబాయ్ కూడా వచ్చారు. తండ్రి మల్లికార్జునరెడ్డికి కాలు విరగడంతో ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆయనను ఇంటి ప్రాంగణంలో పడుకోపెట్టారు. తీవ్రంగా గాయపడిన లత కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బంధువులు, వీధిలోని ప్రజలు, సన్నిహితులు, గోథ్నవి పని చేసిన సరస్వతి విద్యామందిరం స్కూల్ ఉపాధ్యాయులు, యాజమాన్యం ద్వారకానగర్‌కు వచ్చి కడసారి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. సహచరురాలు దూరం కావడంతో ఉపాధ్యాయులు కంట తడి పెట్టారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా..
గోథ్నవి నిశ్చితార్థం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో శివారెడ్డి ఉన్నారు. ఆయన గోథ్నవికి స్వయాన చిన్నాన్న. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న వారిలో ముగ్గురు మృతి చెందగా, మిగతా వాళ్లు తీవ్రంగా గాయ పడ్డారు. అయితే వెనుక సీట్లో కూర్చున్న శివారెడ్డి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయట పడ్డారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆయనే స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాడు. అంబులెన్స్‌కు సమాచారం అందించి అందిరినీ ఆస్పత్రికి తరలించారు. చీకటి కావడంతో ఎవరు, ఎక్కడ ఉన్నారో తెలియలేదని, తర్వాత దారిన వెళ్లే ప్రజలు వచ్చి సెల్‌ఫోన్‌ల లైట్ వేయడంతో.. అందరినీ గుర్తు పట్టి సకాలంలో ఆస్పత్రికి చేర్చగలిగామని శివారెడ్డి తెలిపారు.
ఎవరి కోసం బతకాలమ్మా..
రోడ్డు ప్రమాదంలో ఇందిరా కూడా తీవ్రంగా గాయపడింది. కుమార్తె మృతి చెందిందనే విషయం తెలిసినప్పటి నుంచి ఆమె రోదించసాగిందని బంధువులు అంటున్నారు. కర్నూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉండిపోయింది. ‘నా కొడుకు చనిపోతే పిల్ల కోసమైనా బతకమంటిరే.. ఇప్పుడు నా పిల్ల దూరమైతే ఇక ఎవరి కోసం బతకాలి దేవుడా..’ అంటూ కుమార్తె మృతదే హం వద్ద కూర్చొని విలపిస్తోంది. మూడేళ్ల క్రితం కుమారుడు శివ ఆత్మహత్య చేసుకున్నా డు. కొన్ని నెలల పాటు కుమారుడ్ని తలచుకుంటూ రోదించేది. ఇప్పుడు ఆమెను ఓదార్చడానికి బంధువులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరి సారిగా తనివి తీరా కుమార్తెను చూసుకున్న తల్లి ఇందిరా.. ముద్దాడి ఆమెకు తుది వీడ్కోలు పలికింది. ఆదివారం సాయంత్రం ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశాన వాటికలో గోథ్నవి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment